హైబీపీ ఉండడం ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. దీని వల్ల గుండె జబ్బులు వస్తాయి. హార్ట్ ఎటాక్‌లు సంభవిస్తాయి. ఒక్కోసారి ఇవి ప్రాణాల మీదకు తెస్తాయి. కనుక ఎవరికైనా హైబీపీ ఉంటే తగు జాత్రలు తీసుకోవాల్సిందే. ఇక హైబీపీ లేని వారు అది రాకుండా ఉండేందుకు కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వారు కింద సూచించిన పలు ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి, లేదా వాటిని పూర్తిగా మానేయాలి. దీంతో హైబీపీ రాకుండా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. మరి హైబీపీ రాకుండా ఉండాలంటే మనం ఏయే ఆహారాలను పూర్తిగా మానేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.
ప్యాక్ చేయబడిన చిక్కుళ్లు, టిన్నుల్లో అమ్మే ట్యూనా ఫిష్, నిల్వ ఉండే ఉప్పు తదితర ఆహారాలను తినరాదు. ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి. ఫలితంగా హైబీపీ వస్తుంది. కనుక ఈ ఆహారాలను మానేయాలి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో రక్త నాళాలు గట్టిగా మారుతాయి. ఫలితంగా హైబీపీ వస్తుంది. కనుక కొవ్వు పదార్థాలను కాకుండా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఎప్పుడో ఒకసారి మద్యం సేవిస్తే ఫర్వాలేదు. కానీ రోజూ మద్యం సేవించే అలవాటు ఉన్నవారిలో బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. కనుక ఆ అలవాటును మానుకుంటే మంచిది. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు.
నీరు ప్రవహించే ఏదైనా చిన్నపాటి పైపును అలాగే కొంత సేపు వత్తి పెట్టి ఉంచండి. వెంటనే వదిలేయండి. అప్పుడు ఏమవుతుందో తెలుసు కదా. సరిగ్గా కాఫీ తాగినప్పుడు కూడా మన రక్తనాళాలకు అదే జరుగుతుంది. కనుక కాఫీ బాగా తాగే వారు తక్కువగా తాగడం లేదా దాన్ని పూర్తిగా మానేయడం మంచిది. దీంతో హైబీపీ, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొవ్వు తీసిన పాలను తాగడం ఓకే. కానీ కొవ్వు తీయని పాలను తాగితే వాటిలో ఉండే కొవ్వు మన శరీరంలో చేరి రక్తనాళాల్లో పేరుకుపోతుంది. నాళాలు దృఢంగా మారుతాయి. రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. కనుక ఎవరైనా కొవ్వు తీసిన పాలను తాగితే మంచిది. పాలతో తయారు చేసే చీజ్‌లో కొన్ని కంపెనీలు రుచి కోసం ఉప్పు కలుపుతాయి. ఇలాంటి చీజ్‌ను తింటే శరీరంలో సోడియం పెరిగిపోయి హైబీపీ వస్తుంది. మోజరెల్లా, ఎమ్మెన్టాల్, ఛెడ్డార్, ఫెటా, ఎడామ్ తదితర చీజ్ రకాల్లో ఉప్పును బాగా కలుపుతారు. కనుక ఈ చీజ్ వెరైటీలకు దూరంగా ఉండడం మంచిది.
చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినరాదు. ఇవి స్థూలకాయం, డయాబెటిస్‌లను కలగజేస్తాయి. దీర్ఘకాలంలో హైబీపీ వస్తుంది. అనంతరం గుండె జబ్బులు వస్తాయి. రక్తనాళాలు గట్టిపడి హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. కనుక ఎవరైనా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తినరాదు. ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని అస్సలు తినరాదు. ఎందుకంటే దాన్ని నిల్వ ఉంచేందుకు ఉప్పును వాడుతారు. దీనికి తోడు నిల్వ ఉంచబడిన మాంసంలో చెడు కొవ్వు మరింత పెరుగుతుంది. అలాంటప్పుడు ఆ ఆహారాన్ని తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హైబీపీ, హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి ఆహారాలను తీసుకోవడం మానేస్తే మంచిది. నిల్వ ఉంచే ఊరగాయ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా వేస్తారన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి పచ్చళ్లను బాగా తింటే శరీరంలో సోడియం నిల్వలు పెరిగి హైబీపీ వస్తుంది. కాబట్టి పచ్చళ్లను మితంగా తీసుకోవడం మంచిది.