అనేక భారతీయ వంటకాల్లో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది వంటలకు పసుపు రంగును ఇస్తుంది. పసుపులో అనేక ఔషధ విలువలు ఉంటాయి. అనేక ఆయుర్వేద ఔషధాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. పసుపు వల్ల అనేక అనారోగ్య సమస్యలు నయం అవుతాయి. అయితే ఈ 5 రకాల వ్యక్తులు మాత్రం పసుపును తీసుకునే విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు పసుపును తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోతాదుకు మించి తీసుకుంటే సమస్యలు వస్తాయి. గర్భాశయంలో సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక పసుపును వీరు తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
2. ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. అయితే పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో రక్తహీనత సమస్య ఉన్నవారికి ఐరన్ సరిగ్గా అందదు. అందువల్ల వారు పసుపును తక్కువగా వాడాల్సి ఉంటుంది.
3. రక్తాన్ని పలుచన చేసే మందులను వాడేవారు, రక్త స్రావం అధికంగా అయ్యే వారు పసుపును తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
4. పసుపులో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు కూడా పసుపును తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
5. డయాబెటిస్ ఉన్నవారు పసుపును తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కానీ పసుపును అధిక మోతాదులో తీసుకుంటే షుగర్ లెవల్స్ ఎక్కువగా పడిపోతాయి. దీంతో స్పృహ తప్పుతారు. కనుక వారు పసుపును తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
రోజుకు మనం 500 నుంచి 2000 మిల్లీగ్రాముల మోతాదులో పసుపును వాడుకోవచ్చు. అంతకు మించితే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.