Bananas : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అరటి పండ్లు కూడా ఒకటి. అరటి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు, పెద్దలు అందరూ వీటిని ఇష్టంగా తింటారు. సంవత్సరం పొడవునా అరటిపండ్లు మనకు విరివిగా లభిస్తూ ఉంటాయి. అరటిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అరటిపండులో పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్, నియాసిన్, విటమిన్ బి, రైబోప్లేవిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. అరటిపండ్లను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అరటిపండును తీసుకోవడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఎముకలు బలంగా, ధృడంగా తయారవుతాయి. వీటిలో ఉండే క్యాల్షియం ఎముకల సాంద్రతను కాపాడడంలో సహాయపడుతుంది.
అలాగే అరటిపండ్లను తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్స్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. దీంతో మనం ఇతర ఆహారాల జోలికి వెళ్లకుండా ఉంటాము. దీంతో శరీర బరువు అదుపులో ఉంటుంది. అలాగే అరటిపండును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో, గుండె కొట్టుకునే వేగాన్ని అదుపులో ఉంచడంలో దోహదపడుతుంది. అలాగే రోజూ సాయంత్రం సమయంలో అరటిపండును తీసుకోవడం వల్ల శరీరబడలిక తగ్గి చక్కగా నిద్రపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు అరటిపండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి కొందరు మాత్రం అరటిపండును ఎక్కువగా తీసుకోకూడదు.
తరుచూ శ్వాస సమస్యలతో బాధపడే వారు, దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు అరటిపండును తక్కువగా తీసుకోవాలి. అలాగే సైనస్ సమస్యతో బాధపడే వారు, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఎక్కువగా తయారయ్యే వారు అరటిపండును తక్కువగా తీసుకోవాలి. అరటిపండును ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్లేష్మం మరింత ఎక్కువగా తయారయ్యి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక అరటిపండు ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి శవాస సమస్యలతో బాధపడే వారు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.