Basundi : మనకు స్వీట్ షాపుల్లో లభించే వాటిల్లో బాసుంది కూడా ఒకటి. పాలతో చేసే ఈ తీపి వంటకం క్రీమీ టెక్చర్ తో చాలా రుచిగా ఉంటుంది. చల్ల చల్లగా దీనిని తింటూ ఉంటే ఎంత తిన్నా కూడా తనివి తీరదని చెప్పవచ్చు. ఈ బాసుందిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలు ఉంటే చాలు ఈ తీపి వంటకాన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో ఈ బాసుందిని చల్ల చల్లగా తింటూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే బాసుందిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాసుంది తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కటి పాలు – ఒక లీటర్, తరిగిన జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన బాదంపప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పిస్తా పప్పు – 2 టేబుల్ స్పూన్స్, కుంకుమ పువ్వు – చిటికెడు, ఎల్లో ఫుడ్ కలర్ – కొద్దిగా, పంచదార – పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
బాసుంది తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో పాలను పోసి కలుపుతూ మరిగించాలి. పాలపై ఏర్పడే మీగడను పాలల్లో కలపకుండా పక్కకు నెడుతూ మరిగించాలి. ఇలా 30 శాతం మరిగించిన తరువాత తరిగిన డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు వేసి కలపాలి. ఈ పాలను మరలా అలాగే మీగడను పక్కకు నెడుతూ మరిగించాలి. ఇలా 50 శాతం మరిగించిన తరువాత ఫుడ్ కలర్ ను వేసి కలపాలి. పాలు మరింత చిక్కబడిన తరువాత పంచదార వేసి కలపాలి. ఈ పాలను 70 నుండి 80 శాతం చిక్కగా అయ్యే వరకు మరిగించిన తరువాత యాలకుల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాసుంది తయారవుతుంది. దీనిని వేడిగా ఇలాగే తినవచ్చు. లేదంటే ఫ్రిజ్ లో ఉంచి చల్లారిన తరువాత కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన బాసుందిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.