‘ఒక్క పెగ్గే. ఏం కాదులే’ మందు అలవాటు ఉన్నవారు అప్పుడప్పుడు చెప్పే మాట ఇది. అయితే పీపాలు పీపాలు తాగే వారికే కాదు.. రోజుకు ఒకపెగ్గు లేదా రెండు పెగ్గులు తీసుకునే వారు కూడా జాగ్రత్తగా ఉండాలని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నారే గానీ… చిన్న మొత్తంలో తాగితే హాయికరం అని పరిశోధనల్లో రుజువు కాలేదు అని కొందరు అంటారు. అయితే మద్యం పెద్దగా తాగినా… కొద్దికొద్దిగా తాగినా… ఎలా తాగినా ఆరోగ్యం అటకెక్కినట్లే. ముఖ్యంగా ఒక్క పెగ్గే కదా.. అని సర్దిచెప్పుకుంటూ మందు తాగితే.. మీ గుండెకు ముప్పేనని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
తాగుడుకి బానిసైన వారంతా ఆ ఒక్క పెగ్గుతో మొదలు పెట్టినవారే. అయితే, మద్యాన్ని బాగా తాగేవారిలాగే, తక్కువ మోతాదులో ఆల్కహాల్ ని తరుచూ తాగేవారు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదట.
మద్యం కొద్దికొద్దిగా పదే పదే తాగితే గుండెకు ముప్పని పరిశోధకులు తేల్చారు. సుమారు కోటి మందిపై ఎనిమిది సంవత్సరాల పాటు జరిపిన ఓ అధ్యయనం ఫలితంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా తాగుతున్నప్పుడల్లా గుండె కొట్టుకొనే వేగంలో మార్పులు వస్తాయని తెలుస్తోంది. దీంతో గుండెపోటుకు గురయ్యే ప్రమాదం తప్పదు.