హాయిగా నిద్రపోయే వారంతటి అదృష్ట వంతులు లేరు అంటుంటాం. నిజమే శరీరం పునరుత్తేజం పొంది ఉత్సాహంగా మళ్లీ పనిచేసేందుకు ఉపయోగపడే సాధనం నిద్ర. టీవి చూడడమో లేక గేమ్స్ వల్ల లేదా ఇతర పలు కారణాల వల్ల రోజు మన నిద్రలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక పైసా ఖర్చులేకుండా అందం, ఆరోగ్యం, ఉత్సాహాన్నిచ్చే నిద్రను చేజేతులా చేజార్చు కుంటోంది ఈ తరం. సమయానికి నిద్రపోకుండా ఆలస్యం చేయడం ఉదయాన్నే నిద్ర లేవకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ల కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేచే వాళ్ల మెదడు పనితీరులో తేడాలు ఉంటాయని పరిశోధనలలో తెలిసింది. ఆలస్యంగా నిద్రించడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుందట.
వాళ్ళు చేసే పనుల్లో చురుకుతనం తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాక, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, చిన్న విషయాలకు కోపగించుకోవడం, మధుమేహం అదుపు తప్పడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. సో.. టైమ్‌కి తిని.. టైమ్‌కి నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా ఉత్తమం.