షుగర్ వ్యాధి వచ్చిన మొదటి దశలో దానిని ఆహారం ద్వారానే నియంత్రించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ దశ దాటి వ్యాధిని నివారించటానికి మందులను కూడా వాడాల్సిన దశ వస్తుంది. ఈ దశ ఒక్కోక్కరికి ఒకో రీతిలో వుంటుంది. దీనికిగాను ఆహార ప్రణాళిక అంటూ ఆచరించాల్సిన అవసరం లేదు. ప్రతి దినం ఛార్టు చూసుకొని తినడం చాలా కష్టం. అదీకాక పండుగలు, లేదా ఇతర వేడుకలకు హాజరైనపుడు మరింత కష్టంగా వుంటుంది. కనుక ఛార్టు కంటే కూడా ఒక ఆహార ప్రణాళిక వుంటే చాలు. షుగర్ వ్యాధి వచ్చిన వారు ఏమి తినాలి? తినాల్సినవి ఆరోగ్యాన్నిచ్చే పదార్ధాలని చెప్పాలి. ఏమి తినాలి, ఎంత తినాలి ? ఏమి తినకూడదు అనేవి తెలిస్తే చాలు. తినాలా ? వద్దా? అనేది ప్రశ్నకాదు.
తినేముందు తీసుకునే సరి అయిన నిర్ణయం తెలిసుండాలి. సాధారణంగా షుగర్ వ్యాధి వారికి మూడు భోజనాలు తీసుకోవాలని చెప్పవచ్చు. అవి ఒకటి బ్రేక్ ఫాస్టు, లంచ్, డిన్నర్ లు మాత్రమే. వీటితో పాటు మూడు స్నాక్ లు మాత్రమే. ఈ మూడు స్నాక్ లను మీ సౌకర్యాన్ని బట్టి మూడు భోజనాల మధ్య వుంచండి. ఆహారంలో ప్రధానంగా ఆరు అంశాలుండాలి. కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రొటీన్, మినరల్స్, విటమిన్లు, నీరు. కార్బోహైడ్రేట్ లను రోజంతా వుండేలా చూసుకోవాలి. అన్నం, గోధుమలు రెండూ ఒకే కేలరీలు కలిగి వుంటాయి. అయితే, గోధుమలో ప్రొటీన్లు, పీచు అధికం.
మీరు తీసుకునేది బ్రేక్ ఫాస్టు – స్నాక్స్ -లంచ్- స్నాక్స్ -డిన్నర్ -స్నాక్స్ గా వుండాలి. లేదా బ్రేక్ ఫాస్ట్- స్నాక్స్ -లంచ్- స్నాక్స్- స్నాక్స్ -డిన్నర్ గా వుండాలి. తీసుకునే పదార్ధాలలో పీచు బాగా వుండాలి. కనుక అన్నం, గోధుమ రెండూ తీసుకుంటూ వుండండి. పోషకాహార సమతౌల్యానికి గాను సలాడ్ లు, వెజిటబుల్స్ తీసుకోండి. బరువు అధికంగా వుంటే తగ్గించుకోండి. కేలరీ ఆహారం తగ్గించి పీచు ఆహారం అధికంగా తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. కిడ్నీ సమస్యలుంటే తప్ప మాంసాహారం మానవద్దు. చికెన్, చేప ల వంటివి మంచిది. కొలెస్టరాల్ అధికంగా వుంటే గుడ్లు, రెడ్ మీట్ మానండి.