Beer : మార్చి నెల ముగింపునకు వచ్చేసింది. దీంతో ఎండల వేడి ఇంకా పెరిగింది. ఇంకొన్ని రోజులు పోతే మధ్యాహ్నం సమయంలో అసలు కాలును బయట పెట్టలేం. అంతలా ఎండలు ఉంటాయి. ఇక మే నెల వస్తే వేడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భానుడు భగ భగ మండుతూ మనకు వేసవి తాపం కలిగిస్తాడు. అయితే వేసవిలో సహజంగానే మద్యం ప్రియులు బీర్‌లను ఎక్కువగా తాగుతుంటారు. ఎందుకంటే బీర్‌లు చల్లగా ఉంటాయి. కనుక వాటిని తాగితే వేసవి తాపం నుంచి బయట పడవచ్చని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. వాస్తవానికి బీర్ చల్లగానే ఉంటుంది. కానీ అందులో ఆల్కహాల్ ఉంటుంది కనుక అది మనకు వేడినే కలగజేస్తుంది.
బీర్‌ను తాగిన తరువాత కాసేపటి వరకు మనకు చల్లగానే అనిపిస్తుంది. కానీ అందులో ఉండే ఆల్కహాల్ ఎప్పుడైతే మన శరీరంలో ప్రవహిస్తుందో.. అప్పుడు శరీరం వేడిగా మారుతుంది. దీంతో సాధారణ పరిస్థితిలో ఉన్నప్పటి కన్నా మనకు బీర్ తాగాకే చెమట ఎక్కువగా పడుతుంది. ఇది శరీరానికి అసలు మంచిది కాదు. దీంతో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. శరీరంలో ఉండే ద్రవాలు అన్నీ త్వరగా ఖర్చవుతాయి. దాహం బాగా అవుతుంది. దీంతో చివరకు ఎండ దెబ్బ తగులుతుంది. కనుక వేసవిలో చల్లగా ఉంటాయని చెప్పి బీర్‌లను అధికంగా తాగితే.. ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక వేసవిలో మన జీర్ణ వ్యవస్థ సహజంగానే పలు ఇబ్బందులకు గురవుతుంటుంది. కడుపులో మంట, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు కొందరికి వేసవిలోనే అధికంగా వస్తుంటాయి. శరీరంలో వేడి పెరిగితే ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు బీర్‌లను తాగితే ఇంకా సమస్యలు ఎక్కువవుతాయి. కనుక వేసవిలో చల్లగా ఉండడం కోసం బీర్‌లను తాగితే ఆ విధమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. చల్లదనం కోరుకునే వారు ఈ సీజన్‌లో లభించే పుచ్చకాయ, తర్బూజా వంటి పండ్లను తినాలి. అలాగే నిమ్మకాయ షర్బత్, రాగుల జావ, కొబ్బరినీళ్లు.. వంటి వాటిని తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. అంతేకానీ బీర్లను చల్లదనం కోసం తాగరాదు.