Apple Banana Juice : మనం ఆహారంలో భాగంగా ఆపిల్, అరటి పండు వంటి పండ్లను తింటూ ఉంటాం. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఆపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ ఆపిల్ ను తింటూ ఉండడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఆస్తమా వ్యాధిని నివారించడంలో కూడా ఆపిల్ పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.
అదే విధంగా అరటి పండ్లను తినడం వల్ల కూడా మన శరీరానికి విటమిన్ బి6, విటమిన్ సి వంటి విటమిన్స్ తోపాటు పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ వంటి విటమిన్స్ కూడా లభిస్తాయి. వీటిని మనం ఎక్కువగా నేరుగానే తింటూ ఉంటాం. ఆపిల్, అరటి పండ్లను కలిపి మనం జ్యూస్ గా చేసుకుని కూడా తాగవచ్చు. ఇలా జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల ఎండ వల్ల కలిగే నీరసం తగ్గి శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఆపిల్, అరటి పండ్లను కలిపి జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ అరటి పండ్ల జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఆపిల్స్ – 2 (చిన్నవి), అరటిపండు – 1, పాలు – ఒక గ్లాస్, ఐస్ క్యూబ్స్ – తగినన్ని, తేనె – 2 టేబుల్ స్పూన్స్, పంచదార – 2 టేబుల్ స్పూన్స్ లేదా తగినంత, బాదం పలుకులు – కొద్దిగా, జీడిపప్పు పలుకులు – కొద్దిగా.
ఆపిల్ అరటి పండ్ల జ్యూస్ తయారీ విధానం..
ముందుగా ఆపిల్స్ ను శుభ్రంగా కడిగి పైన ఉండే తొక్కను తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో లేదా బ్లెండర్ లో ఆపిల్ ముక్కలను, పాలను, ఐస్ క్యూబ్స్ ను వేసుకోవాలి. వీటితోపాటు అరటి పండ్లను కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి తేనె, పంచదారను వేసి మళ్లీ మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకుని గ్లాసులలో పోసి జీడిపప్పు, బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆపిల్ అరటి పండ్ల జ్యూస్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనాన్ని పొందడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఆపిల్, అరటి పండ్లను నేరుగా తినలేని వారు ఇలా జ్యూస్ గా కూడా చేసుకుని కూడా తాగవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల ఆపిల్, అరటి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.