అధిక బరువును తగ్గించుకోవడం అన్నది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. అందుకు గాను చాలా మంది అనేక రకాల క్రాష్ డైట్‌లను పాటిస్తున్నారు. అయితే అధిక బరువును తగ్గించుకునే యత్నంలో శరీరం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు గాను రోజూ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలను తీసుకోవాలి. దీంతో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. ఇక శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు అధిక బరువును తగ్గించేందుకు పసుపు బాగా పనిచేస్తుంది. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా స్థూలకాయం సమస్య నుంచి బయట పడవచ్చు.
పసుపులో ఔషధ విలువలు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూస్తుంది. శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక బరువు తగ్గాలంటే రోజూ పసుపును ఏవిధంగా, ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోండి.
అధిక బరువును తగ్గించేందుకు పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో తయారు చేసే టీని తాగితే బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. ఒక కప్పు నీటిని తీసుకుని బాగా మరిగించాలి. అనంతరం అందులో చిటికెడు పసుపు వేయాలి. కొద్దిగా దాల్చినచెక్క పొడి కూడా వేసి సన్నని మంటపై మరిగించాలి. దీంతో కొద్ది సేపటికి టీ తయారవుతుంది. అందులో తీపి కావాలనుకుంటే తేనె కలుపుకోవచ్చు. దీన్ని ఉదయాన్నే పరగడుపునే రోజూ తాగాలి.
పసుపు పాలు కూడా అధిక బరువును తగ్గించేందుకు సహాయ పడతాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీంతోపాటు యోగా, వ్యాయామాలు చేయాలి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు.
పసుపులో విటమిన్ బి, సి, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా లినోలియిక్ యాసిడ్, ఫైబర్, పొటాషియం, ఐరన్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. పసుపులో ఉండే థయామిన్, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, సోడియం, విటమిన్లు, కాల్షియం, మాంగనీస్, పొటాషియం, నియాసిన్‌లు శరీరంలో ఉండే కొవ్వును కరిగించేందుకు సహాయపడతాయి. దీంతో బరువు తగ్గుతారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365