Lemon Juice : రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు ఎక్కువవుతున్నాయి. ఎండ తీవ్రత అధికమవుతోంది. వేసవి తాపం నుండి బయటపడడానికి చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తోంస్తుంది. అలాంటప్పుడు బయట దొరికే శీతల పానీయాలను, చల్లటి నీటిని తాగడానికి బదులుగా నిమ్మ కాయలతో జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల అధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా నిమ్మకాయలతో జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసం తగ్గి, శరీరానికి శక్తి లభిస్తుంది. ఒక నిమ్మకాయతో మనం మూడు రకాల జ్యూస్ లను తయారు చేసుకుని తాగవచ్చు. ఒక నిమ్మకాయతో మనం లెమన్ జ్యూస్, పుదీనా లెమన్ జ్యూస్, అల్లం లెమన్ జ్యూస్ లను తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
లెమన్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా ఒక గ్లాసులో 3 లేదా 4 టీ స్పూన్ల చక్కెరను, ఒక గ్లాస్ చల్లని నీటిని, ఒక పెద్ద నిమ్మకాయ నుండి తీసిన నిమ్మరసాన్ని వేసి చక్కెర కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో చిటికెడు ఉప్పును కూడా వేసుకోవచ్చు. ఇంకా చల్లగా కావాలి అనుకునే వారు ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లెమన్ జ్యూస్ తయారవుతుంది.
పుదీనా లెమన్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా తయారు చేసుకున్న లెమన్ జ్యూస్ లో 15 పుదీనా ఆకులను మెత్తగా చేసి వేయాలి. ఇందులోనే చిటికెడు జీలకర్ర పొడిని, చిటికెడు ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పుదీనా లెమన్ జ్యూస్ తయారవుతుంది. దీనిని జల్లిగంట సహాయంతో వడకట్టుకుని కూడా తాగవచ్చు.
అల్లం లెమన్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా తయారు చేసుకున్న లెమన్ జ్యూస్ ను తీసుకుని అందులో 5 పుదీనా ఆకులు, ఒక ఇంచు అల్లం ముక్కను దంచి దాని నుండి తీసిన రసాన్ని కలపాలి. ఇందులోనే ఉప్పును వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల అల్లం లెమన్ జ్యూస్ తయారవుతుంది.
ఈ విధంగా నిమ్మకాయలను ఉపయోగించి రుచికి తగ్గట్టు జ్యూస్ లను చేసుకుని తాగవచ్చు. ఇలా నిమ్మకాయలతో జ్యూస్ లను చేసుకుని తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి పొందవచ్చు.