Throat Pain : సీజన్ మారుతున్న సమయంలో చాలా మంది సహజంగానే గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఎటువంటి మందులను వాడే అవసరం లేకుండానే ఇంటి చిట్కాలను ఉపయోగించి మనం ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండానే కేవలం మన ఇంట్లో ఉండే వాటితో కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కషాయాన్ని తయారు చేయడానికి గాను ఒక కప్పు పుదీనా ఆకులను, ఒక కప్పు తులసి ఆకులను, ఒక టీ స్పూన్ బెల్లాన్ని, అర టీ స్పూన్ మిరియాల పొడి, ఒక గ్లాస్ నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన పుదీనా ఆకులను, తులసి ఆకులను వేసి ఒక గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని వేసి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడిని వేసి మరో 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టుకోవాలి.
ఈ కషాయం గోరు వెచ్చగా ఉన్నప్పుడే రోజుకు రెండు పూటలా తాగడం వల్ల గొంతు నొప్పి, తలనొప్పి, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల ఎటువంటి దుష్పభ్రావాలు కలగవని.. గొంతులో చాలా తేలికగా ఉంటుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.