Tomato Carrot Cucumber Juice : కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనం అనేక రకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. కొన్ని రకాల కూరగాయలను కూరగా వండుకుని తినడంతో పాటు జ్యూస్ గా కూడా చేసుకుని తాగవచ్చు. అలాంటి కూరగాయల్లో క్యారెట్, టమాట, కీరదోస కూడా ఒకటి. వీటిని కూరగా వండుకుని తినడం కంటే పచ్చిగా లేదా జ్యూస్ గా చేసి తీసుకోవడం వల్ల మంచి పోషకాలను పొందవచ్చు. పిల్లలు వీటిని నేరుగా తినడానికి ఇష్టపడరు కనుక వీటిని జ్యూస్ గా చేసి ఇవ్వడం వల్ల వారికి చక్కటి ఆరోగ్యాన్ని అందించవచ్చు. క్యారెట్, కీరదోస, టమాటాలను కలిపి జ్యూస్ గా చేసుకుని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని, అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
కండరాలు బలంగా, ధృడంగా తయారవుతాయి. గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా చేయడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, వివిధ రకాల క్యాన్సర్ ల బారిన పడకుండా చేయడంలో కూడా ఈ జ్యూస్ మనకు దోహదపడుతుంది. అంతేకాకుండా క్యారెట్, కీర దోస, టమాటాలతో జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. చర్మ సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మం కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ జ్యూస్ ను తాగవచ్చు.
ఈ జ్యూస్ ను తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణసంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ఈ జ్యూస్ ను తాగవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్, కీరదోస, టమాట జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక కీరదోసను, ఒక పెద్ద క్యారెట్ ను, ఒక పెద్ద టమాటాను తీసుకోవాలి. తరువాత వీటిని శుభ్రపరిచి ముక్కలుగా చేసుకోవాలి.
ఈ ముక్కలను ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినంత తేనె, పావు టీ స్పూన్ ఉప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇందులో చల్లదనం కొరకు ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు. షుగర్ వ్యాధి గ్రస్తులు ఇందులో తేనెను కూడా వేసుకోకపోవడమే మంచిది. అలాగే దీనిలో ఉప్పును కూడా వేసుకోకుండా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన జ్యూస్ ను ఉదయం పూట తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ జ్యూస్ ను తాగడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు అందం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.