Carrot Rice : మనం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. క్యారెట్ గురించి మనందరికీ తెలిసిందే. క్యారెట్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. వీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. క్యారెట్ లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లతోపాటు బీటా కెరోటిన్ కూడా అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
క్యారెట్ ను నేరుగానే చాలా మంది తింటూ ఉంటారు. ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా క్యారెట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. క్యారెట్ తో పచ్చడిని కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా క్యారెట్ ను ఉపయోగించి క్యారెట్ రైస్ ను కూడా చేసుకోవచ్చు. క్యారెట్ తో రైస్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు. చాలా సులువుగా, చాలా రుచిగా.. క్యారెట్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
క్యారెట్ తురుము – ఒక కప్పు, చల్లగా చేసిన అన్నం – ఒక కప్పుతో బియ్యంతో వండినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – ఒకటి, తరిగిన పచ్చి మిర్చి – 3, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీడిపప్పు – 10, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, సాంబార్ పౌడర్ – 1 టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యారెట్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి కరిగిన తరువాత ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలను, పచ్చి మిర్చిని, కరివేపాకును, పసుపును వేసి కలిపి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత క్యారెట్ తురుమును వేసి కలిపి వేయించుకోవాలి. క్యారెట్ తురుము వేగిన తరువాత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, సాంబార్ పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అన్నాన్ని వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉంచి చివరగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ రైస్ తయారవుతుంది. దీనిని రోజులో ఎప్పుడైనా తినవచ్చు. క్యారెట్ ను నేరుగా తినని వారు ఇలా రైస్ గా చేసుకుని తినడం వల్ల కూడా క్యారెట్ లో ఉండే పోషకాలను, క్యారెట్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.