Dibba Rotti : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా చేసే వాటిలో దిబ్బ రొట్టె కూడా ఒకటి. దిబ్బ కొట్టె చాలా రుచిగా ఉంటుంది. దీనిని మినప పప్పు, బియ్యం, ఇతరత్రా పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తారు. అయితే కాస్త శ్రమించాలే కానీ రుచికరమైన దిబ్బ రొట్టెలను తయారు చేసుకోవచ్చు. ఇక వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
దిబ్బ రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒక కప్పు, ఇడ్లీ రవ్వ – ఒక కప్పు, బియ్యం – అర కప్పు, పుల్లటి పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1 ( పెద్దది), పచ్చి మిర్చి – 4, అల్లం – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, వంట సోడా – చిటికెడు, నూనె – పావు కప్పు.
దిబ్బ రొట్టెలను తయారు చేసే విధానం..
ముందుగా బియ్యాన్ని, మినప పప్పును కలిపి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక జార్ లో నానబెట్టుకున్న మినప పప్పును, బియ్యాన్ని వేసి 50 ఎంఎల్ నీళ్లను పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జార్ మూత తీసి అల్లం, పచ్చి మిర్చిని వేసి మరలా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో ఇడ్లీ రవ్వను వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఇడ్లీ రవ్వలోని నీళ్లను తీసేసి ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మినప పప్పు, బియ్యం మిశ్రమంలో వేసి కలపాలి. ఇడ్లీ రవ్వతోపాటు తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, వంటసోడా, జీలకర్ర, పెరుగును వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత రెండు గంటెల పిండిని తీసుకుని మరీ పలుచగా కాకుండా మందంగా ఉండేలా దోశలా వేసుకోవాలి. కళాయిపై మూత పెట్టి చిన్న మంటపై 6 నుండి 7 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు మూత తీసి మరో వైపుకు తిప్పి మరలా మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో దిబ్బ రొట్టె తయారవుతుంది. దీనిని పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసుకునే దోశ, ఇడ్లీలకు బదులుగా అప్పుడప్పుడూ ఇలా దిబ్బ రొట్టెలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి.