Chukka Kura Pachadi : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకు కూరల్లో చుక్క కూర ఒకటి. ఇది పుల్లగా ఉంటుంది. కనుక చాలా మందికి నచ్చుతుంది. దీంతో చాలా మంది పప్పు తయారు చేసుకుని తింటుంటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే చుక్క కూరతో పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఇక దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చుక్క కూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
చుక్క కూర – 2 కట్టలు (మధ్యస్థంగా ఉన్నవి), మెంతులు – కొద్దిగా, ఎండు మిర్చి – 5, పచ్చి మిర్చి – 4, ఆవాలు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – చిటికెడు, నూనె – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కరివేపాకు – ఒక రెబ్బ.
చుక్క కూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా చుక్క కూరను శుభ్రంగా కడిగి చిన్నగా తరిగి పెట్టుకోవాలి. చుక్క కూర కాడలను కూడా తరగాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి కాగాక మెంతులు, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా నూనె ను వేసి తరిగి పెట్టుకున్న చుక్క కూరను వేసి మూత పెట్టి.. మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చుక్క కూర ఉడికిన తరువాత పసుపు, ఉప్పు వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక జార్ లో వేయించి పెట్టుకున్న ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, మెంతులను వేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చుక్క కూరను కూడా వేసి పూర్తిగా కలిసేలా మరో సారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో చిన్న కళాయిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును ముందుగా గిన్నెలోకి తీసుకున్న చుక్క కూర మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే చుక్క కూర పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని రోలులో నూరుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎన్నో పోషకాలు లభిస్తాయి.