Coconut Laddu : ఆహారంలో భాగంగా అప్పుడప్పుడూ మనం పచ్చి కొబ్బరిని కూడా తీసుకుంటూ ఉంటాం. పచ్చి కొబ్బరిలో శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు ఉంటాయి. పచ్చి కొబ్బరిని వంటల తయారీలో ఉపయోగించడంతోపాటు దానితో రకరకాల తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా పచ్చి కొబ్బరితో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. వాటి తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కొబ్బరి లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చి కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – పావు కప్పు కంటే కొద్దిగా ఎక్కువ, పంచదార – ముప్పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
పచ్చి కొబ్బరి లడ్డూ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో పచ్చి కొబ్బరి తురుమును వేసి చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ తురుమును అడుగు భాగం మాడకుండా కలుపుతూ పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. నెయ్యి కరిగి పూర్తిగా కొబ్బరి తురుముతో కలిసి పోయిన తరువాత ఇందులో పాలను పోసి కలుపుకోవాలి. తరువాత పంచదారను వేసి పంచదార పూర్తిగా కరిగే వరకు 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. తరువాత యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొద్దిగా దగ్గర పడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి గోరు వెచ్చగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తరువాత కొబ్బరి మిశ్రమాన్ని తగిన పరిమాణంలో తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి లడ్డూలు తయారవుతాయి. ఈ లడ్డూలను చుట్టేటప్పుడు వాటిపై కొబ్బరి పొడిని చల్లి గార్నిష్ కూడా చేసుకోవచ్చు. అలాగే పచ్చి కొబ్బరిని తురుము పట్టేటప్పుడు దాని వెనుక ఉన్న నల్లని భాగాన్ని తొలగించడం వల్ల కొబ్బరి లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి.
ఈ లడ్డూలను గాలి తగలకుండా బయట ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల మూడు రోజుల పాటు తాజాగా ఉంటాయి. అదే ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల వారం రోజు పాటు తాజాగా ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా పచ్చి కొబ్బరితో చాలా సులభంగా, చాలా త్వరగా ఇలా లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.