Drumstick Leaves Rice : మునగాకును నేరుగా తినలేకపోతే.. ఇలా చేసి తినండి.. ఎంతో ఆరోగ్యకరం..!

Drumstick Leaves Rice : మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. దీన్ని తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఆయుర్వేదంలోనూ మునగాకు గురించి ఎంతో ముఖ్యంగా ప్రస్తావించారు. ఇది 300 కు పైగా వ్యాధులను నయం చేసే శక్తిని కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. కనుక మునగాకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తినాల్సిందే. అయితే దీన్ని నేరుగా తినలేని వారు.. రైస్‌ రూపంలో తయారు చేసి తినవచ్చు. ఈ క్రమంలోనే మునగాకు రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Drumstick Leaves Rice very beneficial to us make it like this
Drumstick Leaves Rice

మునగాకు రైస్‌ తయారీకి కావల్సిన పదార్థాలు..

మునగాకు – ఒక కప్పు, పొడి పొడిగా వండిన అన్నం – ఒక కప్పు, శనగ పప్పు – టీస్పూన్‌, మినప పప్పు – టీస్పూన్‌, ఇతర పోపు గింజలు అన్నీ – ఒక టీస్పూన్‌, ఎండు మిర్చి – 10, పచ్చి మిర్చి – 4, ధనియాలు – రెండు టీస్పూన్స్‌, నువ్వులు – రెండు టీస్పూన్స్‌, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – రెండు రెబ్బలు, నెయ్యి – పావు కప్పు, నూనె – రెండు పెద్ద టీస్పూన్లు, చింతపండు, కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – తగినంత, వేయించిన బఠానీలు – రెండు టీస్పూన్లు.

మునగాకు రైస్‌ తయారు చేసే విధానం..

పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నూనె వేసుకోవాలి. అది వేడి అయ్యాక ఎండు మిరప కాయలు వేసి కాసేపు వేయించాలి. తరువాత శనగ పప్పు, మినప పప్పు, ధనియాలు వేసి వేయించాలి. ఇందులోనే మునగాకు వేసి మరోసారి బాగా వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీలో వేసి కాస్తంత చింత పండు వేసి పొడి చేసుకోవాలి. మరోసారి పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి రెండు టీస్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అది వేడి అయ్యాక పోపు దినుసులు, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు.. ఒకదాని తరువాత మరొకటి వేసి వేయించాలి. అందులో రెండు మూడు టీస్పూన్ల మునగాకు పొడి, అన్నం, ఉప్పు వేసి బాగా కలపాలి. వేయించిన నువ్వులను జత చేయాలి. బఠానీలు, కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన మునగాకు రైస్‌ తయారవుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. పోషకాలు, ఆరోగ్యం రెండూ లభిస్తాయి.

Share
Admin

Recent Posts