Condensed Milk : మనం వంటింట్లో అప్పుడప్పుడూ తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. కొన్ని రకాల తీపి పదార్థాల తయారీలో మనం మిల్క్ మెయిడ్ ను ఉపయోగిస్తూ ఉంటాం. దీనినే కండెన్స్‌డ్ మిల్క్ అని కూడా అంటారు. దీనిని తీపి పదార్థాలతోపాటు కేక్స్, పుడ్డింగ్స్ వంటి వాటి తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మిల్క్ మెయిడ్ మనకు బయట ఎక్కువగా దొరుకుతుంది. దీనిని ఇంట్లో తయారు చేసుకోలేమని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ ఈ మిల్క్ మెయిడ్ ను చాలా సులువుగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన మిల్క్ మెయిడ్ కూడా బయట దొరికే విధంగా ఉంటుంది. చాలా సులువుగా మిల్క్ మెయిడ్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మిల్క్ మెయిడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పాలు – అర లీటర్, పంచదార – ఒక కప్పు లేదా 150 గ్రా., బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూన్.
మిల్క్ మెయిడ్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిని నీటితో కడిగి అందులో పాలను పోయాలి. ఈ పాలను మధ్యస్థ మంటపై మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ పాలు పొంగు వచ్చే వరకు మరిగించాలి. పాలు మరిగిన తరువాత పంచదారను వేసి కలుపుతూ ఉండాలి. పంచదార వేసిన తరువాత పాలు రంగు మారడాన్ని మనం గమనించవచ్చు. అర లీటర్ పాలలో పావు వంతు మిగిలే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత బేకింగ్ పౌడర్ ను వేసి 2 నిమిషాల పాటు ఉండలు లేకుండా కలిపి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే మిల్క్ మెయిడ్ తయారవుతుంది. దీనిని గాలి తగలని గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్ లో పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ మిల్క్ మెయిడ్ ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇలా నిల్వ చేసుకున్న మిల్క్ మెయిడ్ తో ఎంతో రుచిగా తీపి పదార్థాలను తయారు చేసుకుని తినవచ్చు.