Ragi Idli : మనం ఇడ్లీలను, దోశలను తయారు చేయడానికి వేరు వేరుగా మిశ్రమాలను తయారు చేస్తూ ఉంటాము. ఒకే సారి తయారు చేసిన మిశ్రమంతో ఇడ్లీలను, దోశలను చేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి రాగి పిండిని కలపడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. ఒకే మిశ్రమంతో రాగి దోశను, రాగి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి, తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి ఇడ్లీ, రాగి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – ఒకటిన్నర కప్పు, బియ్యం – ఒకటిన్నర కప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – అర కప్పు, రాగి పిండి – ఒకటిన్నర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా.
రాగి దోశ, రాగి ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినప పప్పు, బియ్యం, అటుకులు, మెంతులు వేసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకుని 4 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకుని తగినన్ని నీళ్లను పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో ముందుగా నానబెట్టుకున్న మినప పప్పు, బియ్యాన్ని వేసి మెత్తగా దోశ పిండిలా పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని అందులో ముందుగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా లేదా 7 నుంచి 8 పాటు పులియబెట్టుకోవాలి. పిండి పులిసిన తరువాత రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న రాగి మిశ్రమంతో ఎంతో రుచిగా ఉండే దోశలను, ఇడ్లీలను ఒకే సారి తయారు చేసుకోవచ్చు.
రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో జావ, రాగి ముద్ద వంటివి చేసుకుని తింటుంటారు. అయితే ఇడ్లీలు, దోశలను కూడా తయారు చేసి తినవచ్చు. పైన తెలిపిన విధంగా పిండిని తయారు చేసుకుంటే ఒకేసారి దోశలు లేదా ఇడ్లీలు ఏవైనా తయారు చేసుకోవచ్చు. రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వేసవిలో ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా శరీరంలోని వేడి మొత్తం పోతుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.