Cinnamon : దాల్చిన చెక్క‌తో ఈ 14 అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Cinnamon : దాల్చిన చెక్క‌ను స‌హ‌జంగానే మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. దీన్ని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. అయితే వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం దాల్చిన చెక్క‌లో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

14 amazing home remedies using Cinnamon
Cinnamon

1. దాల్చిన చెక్క పొడిని కొద్దిగా తీసుకుని అందులో కొద్దిగా తేనె క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రాస్తుంటే.. గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు త‌గ్గిపోతాయి.

2. ఆర్థ‌రైటిస్ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీళ్లు, తేనె క‌లిపి పేస్ట్‌లా చేసి నొప్పి ఉన్న చోట రాయాలి. ఇలా రాత్రి పూట చేయాలి. దీంతో మ‌రుస‌టి రోజు ఉద‌యం వ‌ర‌కు నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్ల వాపులు, నొప్పులు త‌గ్గుతాయి.

3. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని క‌లిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో విరేచ‌నాలు త‌గ్గిపోతాయి.

4. దాల్చిన చెక్క పొడి, నిమ్మ‌ర‌సం తీసుకుని క‌లిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మొటిమ‌లు, బ్లాక్ హెడ్స్‌పై రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ముఖాన్ని గోరు వెచ్చ‌ని నీటితో క‌డుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం ఉంటుంది.

5. ఆలివ్ ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. అందులో తేనె, దాల్చిన చెక్క పొడిల‌ను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని త‌ల‌కు రాసి గంట సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. దీంతో జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గిపోతాయి. ముఖ్యంగా జుట్టు రాల‌డం, చుండ్రు త‌గ్గుతాయి.

6. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చ‌ని నీటితో తీసుకోవాలి. అనంత‌రం 30 నిమిషాలు ఆగాక బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఇలా 40 నుంచి 45 రోజుల పాటు చేస్తే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది.

7. ఒక క‌ప్పు నీటిని మ‌రిగించి అందులో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసి క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని అలాగే ఉంచాలి. 30 నిమిషాల త‌రువాత అందులో తేనె క‌లిపి ఆ మిశ్ర‌మంలో స‌గం తాగాలి. ఇలా రాత్రి పూట స‌గం, మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపున స‌గం.. మిశ్ర‌మాన్ని తాగాలి. ఇలా చేస్తుంటే అధిక బ‌రువు త‌గ్గుతారు.

8. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా నీరు క‌లిపి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని నుదుటిపై రాయాలి. దీంతో త‌ల‌నొప్పి త‌గ్గిపోతుంది.

Cinnamon : నిద్ర బాగా వ‌స్తుంది..

9. ఒక క‌ప్పు నీటిని మ‌రిగించి ప‌క్క‌న పెట్టాలి. అందులో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి క‌లిపి దాన్ని 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం అందులో కొద్దిగా తేనె క‌లిపి తాగాలి. ఇలా రాత్రి పూట నిద్ర‌కు ముందు చేస్తే నిద్ర బాగా వ‌స్తుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

10. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, అంతే మోతాదులో మిరియాల పొడి, తేనెల‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తాగాలి. దీంతో గొంతు నొప్పి, ఇత‌ర గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

11. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని క‌లిపి ఆ నీటితో నోటిని పుక్కిలించాలి. దీంతో నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి.

12. దంతాల నొప్పి బాధ పెడుతుంటే.. చిన్న దాల్చిన చెక్క ముక్క‌ను నోట్లో వేసుకుని న‌ములుతుండాలి. నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

13. ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో అర టీస్పూన్ అల్లం ర‌సం, పావు టీస్పూన్ ల‌వంగాల పొడి, అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడిల‌ను వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజుకు ఒక‌సారి తాగాలి. ద‌గ్గు త‌గ్గుతుంది.

14. ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి క‌లిపి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని ఫేస్ ప్యాక్‌లా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది.

Share
Admin

Recent Posts