అశ్వగంధకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఆయుర్వేదంలో అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సుమారుగా 3వేల ఏళ్ల కిందటి నుంచే అశ్వగంధను ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు, వేర్లు, పండ్లు కాండం అన్నీ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అయితే మనకు మార్కెట్‌లో సాధారణంగా అశ్వగంధకు చెందిన వేర్ల పొడి లభిస్తుంది. ఇది చూర్ణం రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో మనకు అందుబాటులో ఉంది. అశ్వగంధను నిత్యం వాడడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అశ్వగంధ వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడంలో అమోఘంగా పనిచేస్తుంది. శరీరంలో శక్తిస్థాయిలు పెరుగుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అశ్వగంధ అంటే సంస్కృతంలో గుర్రపు వాసన అని అర్థం వస్తుంది. అందువల్లే దానికి ఆ పేరు వచ్చింది. అయితే దీన్ని ఇండియన్ జిన్సెంగ్ అని, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు.
అశ్వగంధలో అధిక మోతాదుతో వితనోలైడ్స్ ఉంటాయి. అందువల్ల అశ్వగంధ వాపులను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ట్యూమర్లు వృద్ధి చెందకుండా చూస్తుంది.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం అశ్వగంధ బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుందని గుర్తించారు. అశ్వగంధను వాడడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో కండరాలు ఇన్సులిన్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. ఈ క్రమంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అశ్వగంధ చూర్ణాన్ని నిత్యం కొందరికి ఇచ్చి 4 వారాల అనంతరం వారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను పరీక్షించారు. దీంతో షుగర్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. అలాగే టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారు 6 మందికి నిత్యం అశ్వగంధను 30 రోజుల పాటు ఇవ్వగా వారిలోనూ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల అశ్వగంధ డయాబెటిస్‌ను అదుపు చేస్తుందని సైంటిస్టులు తేల్చారు.
అశ్వగంధలో విథఫెరిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. క్యాన్సర్ రాకుండా చూస్తుంది. బ్రెస్ట్, లంగ్, కోలన్, బ్రెయిన్, ఓవేరియన్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.
మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ బాగా తగ్గినప్పుడు లేదా మనం తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరంలో ఉండే అడ్రినల్ గ్రంథులు స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్‌ను విడుదల చేస్తాయి. దీంతో కొందరిలో కార్టిసోల్ స్థాయిలు ఎప్పుడూ అధికంగా ఉంటాయి. అలాంటి వారికి బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అలాగే పొట్ట దగ్గర కొవ్వు కూడా బాగా పెరుగుతుంది. కనుక అలాంటి వారు అశ్వగంధను తీసుకోవాలి. దీంతో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. డయాబెటిస్ వ్యాధి రాకుండా ఉంటుంది.
అశ్వగంధను నిత్యం తీసుకున్నట్లయితే ఒత్తిడితోపాటు ఆందోళన కూడా తగ్గుతుందని సైంటిస్టులు తెలిపారు. ఈ మేరకు కొందరు సైంటిస్టులు తీవ్రమైన స్ట్రెస్, ఆందోళనలతో బాధపడుతున్న 64 మందికి నిత్యం అశ్వగంధ ఇచ్చారు. 60 రోజుల తరువాత వారిలో ఒత్తిడి, ఆందోళన తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల ఈ సమస్యలు ఉన్నవారు అశ్వగంధను నిత్యం తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.
డిప్రెషన్‌ను తగ్గించేందుకు కూడా అశ్వగంధ సహాయ పడుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనలు చెబుతున్నాయి. నిత్యం 600 మిల్లీగ్రాముల మోతాదులో అశ్వగంధను 60 రోజుల పాటు కొందరికి ఇవ్వగా వారిలో డిప్రెషన్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు.
సంతాన లోపం సమస్యతో బాధపడే వారికి అశ్వగంధ ఒక వరమని చెప్పవచ్చు. ఇది పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. దీంతోపాటు జననావయవాల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఈ క్రమంలో పురుషుల్లో ఉండే సంతాన లోపం సమస్యలు తగ్గుతాయి. 75 మంది పురుషులకు నిత్యం అశ్వగంధను నిర్దిష్టమైన మోతాదులో ఇచ్చి కొన్ని రోజుల తరువాత వారిని పరీక్షించగా వారిలో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అయిందని వెల్లడైంది. అలాగే అందులో శుక్రకణాల సంఖ్య పెరిగిందని, వాటి కదలికలు కూడా బాగున్నాయని గుర్తించారు. అందువల్ల సంతాన లోపం సమస్య ఉన్న పురుషులు అశ్వగంధను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
అశ్వగంధను నిత్యం తీసుకుండే కండరాలు దృఢంగా మారుతాయి. శక్తి పెరుగుతుంది. నిత్యం 750 నుంచి 1250 మిల్లీగ్రాముల మోతాదులో కొందరు పురుషులకు అశ్వగంధను 30 రోజుల పాటు ఇచ్చారు. తరువాత పరీక్షించగా వారిలో కండరాలు దృఢంగా మారాయని, అంతకు ముందు బలహీనంగా ఉన్నవారు తరువాత దృఢంగా మారారని గుర్తించారు. అందువల్ల శక్తి కోసం అశ్వగంధ మెరుగ్గా పనిచేస్తుంది.
అశ్వగంధను నిత్యం తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. అశ్వగంధను నిత్యం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
గమనిక: అశ్వగంధ మనకు మార్కెట్‌లో చూర్ణం, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. దీన్ని దాదాపుగా ఎవరైనా వాడవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. ట్యాబ్లెటు అయితే రోజుకు 500 ఎంజీ మోతాదులో తీసుకోవచ్చు. అదే చూర్ణం అయితే ఉదయం, సాయంత్రం ఒక్క టీస్పూన్ చాలు. కానీ మోతాదుకు మించితే దుష్పరిణామాలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక తీవ్రమైన సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన మేరకు అశ్వగంధను వాడుకోవడం మంచిది.