వంటింటి దినుసుగా మనందరికీ సుపరిచితమైన వాటిల్లో యాలకులు కూడా ఒకటి. యాలకులు చక్కని వాసనను కలిగి ఉంటాయి. తీపి పదార్థాలతోపాటు వంటల తయారీలో కూడా దీనిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. మనం చేసే వంటల్లో యాలకులను వాడడం వల్ల వంటల రుచితోపాటు వాసన కూడా పెరుగుతుంది. సుగంధ ద్రవ్యాల్లో రారాణిగా పిలవబడే యాలకుల గొప్పతనాన్ని గుర్తించిన మన పూర్వీకులు వీటిని వంటింట్లో భాగంగా చేశారు. యాలకుల్లో ఉండే ఔషధ గుణాల గురించి, వీటిని ఉపయగించడం వల్ల మనకు కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో యాలకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటిలో అధికంగా ఉండే పీచుపదార్థాలు మలబద్దకాన్ని దూరం చేయడంలో సహాయపడతాయి. రాత్రిపడుకునే ముందు రెండు యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి త్వరగా నిద్రపడుతుంది. యాలకులపై పొట్టు కంటే వీటి గింజల్లోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. నోటిపూత, గొంతునొప్పి వంటి వాటితో బాధపడుతున్నప్పుడు గోరు వెచ్చని నీటిలో యాలకుల పొడిని కలుపుకుని ఆ నీటితో పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు తొలగిపోతాయి.
అధిక బరువుతో బాధపడే వారికి యాలకులు చక్కని ఔషధంగా పని చేస్తాయి. వీటిలో అధికంగా ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి. యాలకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కణతలపై రాయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. యాలకుల గింజల్లో యాంటీ బాక్గీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ రెండు యాలకులను నోట్లో వేసుకుని ఎక్కువ సమయం చప్పరించి నమిలి మింగడం వల్ల నోట్లో ఉండే క్రిములు నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా తరచూ చేయడం వల్ల దంతాలు, చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణంకాక కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు రెండు యాలకులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆయా సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వాంతులు ఎక్కువగా అవుతున్నప్పుడు యాలకుల కషాయాన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. యాలకుల పొడిని, శొంఠి పొడిని సమపాళ్లలో తీసుకుని దానికి తేనెను కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల తీవ్రంగా వేధిస్తున్న దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. పడుకునే ముందు పాలలో యాలకుల పొడిని, పసుపును, పంచదారను కలుపుకుని తాగడం వల్ల శరీరంలో రక్తవృద్ధి జరుగుతుంది.
యాలకులు శృంగార సామర్థ్యాన్ని పెంచడంలోనూ అమోఘంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు పాలలో యాలకుల పొడిని వేసుకుని తాగడం వల్ల పురుషుల్లో అంగస్తంభన సమస్య తగ్గడంతోపాటు వీర్యకణాల సంఖ్య కూడా పెరుగుతుంది. యాలకులను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు పలు రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో వెల్లడైంది.
రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి కూడా యాలకులకు ఉంటుంది. మూత్ర బిగింపు సమస్యతో బాధపడుతున్నప్పుడు యాలకుల పొడిని నీటిలో కలుపుకుని తాగడం వల్ల మూత్రం సాఫీగా జారీ అవుతుంది. రోజూ రెండు యాలకులు తినడం వల్ల చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు యాలకుల పొడిని, నల్ల జీలకర్ర పొడిని, కర్పూరం పొడిని, గంధాన్ని సమపాళ్లలో తీసుకుని చర్మ వ్యాధులు ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల ఈ సమస్యల నుండి చక్కని ఉపశమనం కలుగుతుంది.
మన శరీరానికి మేలు చేస్తున్నాయి కదా అని వీటిని ఎక్కువగా తీసుకోరాదు. యాలకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలో మంటతోపాటు శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిత్తాశయంలో రాళ్లు ఉన్న వారు యాలకులకు దూరంగా ఉండడం మంచిది. ఈ విధంగా యాలకులను ఉపయోగించడం వల్ల మనం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.