మనలో చాలా మంది తీపి పదార్థాలను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు బయట విరివిరిగా దొరికే తీపి పదార్థాల్లో రసగుల్లా కూడా ఒకటి. రసగుల్లాను చాలా మంది ఇష్టంగా తింటారు. బెంగాలీ వంటకమైన ఈ రసగుల్లాను మనం చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రసగుల్లాను రుచిగా, సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసగుల్లా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిక్కని పాలు – ఒక లీటర్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, పంచదార – 2 కప్పులు, నీళ్లు – 4 కప్పులు, యాలకుల పొడి – పావు టీ స్పూన్.
రసగుల్లా తయారీ విధానం..
ముందుగా ఒక గ్లాస్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకోవాలి. ఈ నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ నీళ్లను పోసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో పాలను పోసి పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. పాలు పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి రెండు నిమిషాల పాటు చల్లారనివ్వాలి. తరువాత ఈ పాలల్లో ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసి కలపాలి. మరలా ఈ పాలను స్టవ్ మీద ఉంచి పాలు పూర్తిగా విరిగే వరకు వేడి చేయాలి.
పాలు, నీళ్లు పూర్తిగా వేరైన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక కాటన్ వస్త్రంలో ఈ పాల విరుగుడును వేసి నీరంతా పోయేలా వడకట్టుకోవాలి. తరువాత ఈ సాల విరుగుడును రెండు నుండి మూడు సార్లు నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల పాలవిరుగుడులో ఉండే నిమ్మరసం రుచి పూర్తిగా తొలగిపోతుంది. ఇలా కడిగిన తరువాత మరలా పాల విరుగుడులో ఉండే నీరు అంతా పోయేలా చేత్తో పిండడం కానీ, దానిపై బరువును ఉంచడం కానీ చేయాలి. నీరు లేకుండా చేసుకున్న తరువాత పాలవిరుగుడును ఒక ప్లేట్ లోకి తీసుకుని 10 నుండి 15 నిమిషాల పాటు చేత్తో ఒత్తుతూ మెత్తగా, ముద్దగా చేసుకోవాలి. తరువాత పాలవిరుగుడు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి.
తరువాత ఒక పెద్ద గిన్నెలో పంచదారను, నీళ్లను వేసి పంచదార కరిగే వరకు తిప్పుతూ వేడిచేయాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న ఉండలను ఒక్కొక్కటిగా వేసి మూత పెట్టి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని నాలుగు నుండి ఆరు గంటల పాటు కదిలించకుండా పక్కన ఉంచాలి. ఇలా చేయడంవల్ల రసగుల్లాలు పంచదార మిశ్రమాన్ని చక్కగా పీల్చుకుంటాయి. ఈ విధంగా చేయడం వల్ల అచ్చం బయట దొరికే విధంగా ఉండే రసగుల్లాలు తయారవుతాయి. ఇలా చేసిన రసగుల్లాలను అందరూ ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడూ మనం వేడి చేసిన పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిన పాలను పారబోయకుండా వాటితో ఎంతో రుచిగా ఉండే రసగుల్లాలను తయారు చేసుకుని తినవచ్చు.