Nalla Thumma Kayalu : మన చుట్టూ అనేక రకాల ఔషధ మొక్కలు, చెట్లు ఉంటాయి. కానీ వీటిలో ఔషధ గుణాలు ఉంటాయని వీటిని వాడడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలు పొందుతామని మనలో చాలా మందికి తెలియదు. ఇలా మనకు విరివిరిగా లభించడంతో పాటు ఔషధ గుణాలను కలిగిన మొక్కలల్లో తుమ్మ చెట్టు ఒకటి. పొలాల దగ్గర, రోడ్డు పక్కల ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. నల్లటి బెరడు, పసుపు రంగు పూలు, పొడవాటి కాయలు, చిన్న చిన్న ఆకులను ఈ చెట్టు కలిగి ఉంటుంది. దీనిలో నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, సర్కార్ తుమ్మ, ఆస్ట్రేలియా తుమ్మ, నాగ తుమ్మ వంటి అనేక రకాలు ఉంటాయి. కొన్ని రకాల తుమ్మ చెట్లు 40 నుండి 70 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.
అలాగే ఈ చెట్లు పెరగడానికి ఎక్కువగా నీరు కూడా అవసరం. అలాగే అన్ని రకాల నేలల్లో కూడా ఈ చెట్టు పెరుగుతుంది. ఈ చెట్టు కొమ్మలను పొలాలకు, చేలకు కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. అలాగే ఈ చెట్టు కలపతో బొమ్మలు, పడవలు, వివిధ రకాల ఫర్నీచర్ ను తయారు చేస్తారు. తుమ్మ చెట్టులో ప్రతి భాగం కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా నల్ల తుమ్మ చెట్టులో అధికంగా ఈ ఔషధ గుణాలనేవి ఉంటాయి. నల్ల తుమ్మ చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే ఈ చెట్టును ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల తుమ్మ బెరడుతో పాటు దాని జిగురును, కాయలను ఈ మూడింటిని కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే నల్ల తుమ్మ ఆకులు కూడా మనకు ఎంతో ఉపయోగపడతాయి. లేత నల్ల తుమ్మ ఆకులను సేకరించి జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి. అలాగే నల్ల తుమ్మ కాయలను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడికి తగినన్ని నీళ్లు అలాగే కండె చక్కెరను కలిపి పేస్ట్ లా చేసుకుని తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఈ లేత తుమ్మకాయలను తినడం వల్ల పురుషుల్లో వచ్చే స్వప్న స్కలనం, శ్రీఘ స్కలనం వంటి సమస్యలు తగ్గుతాయి. నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకుని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి.
ఇలా చేయడం వల్ల నోటిపూత, నోటిలో అల్సర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. నల్ల తుమ్మ జిగురును కూడా నోట్లో కొద్ది సేపు ఉంచుకుని ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా నోటి సమస్యలు, నోటి పూత, నోటిలో అల్సర్లు వంటి అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాలల్లో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు సైతం త్వరగా అతుకుంటాయి. నల్ల తుమ్మ చెట్టు బెరడును 5 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 2 గ్రాముల కాయ చూర్ణం పొడిని కలపాలి. తరువాత ఈ పొడిని వెన్న పూసతో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. అలాగే తెల్ల బట్ట సమస్యతో బాధపడే స్త్రీలు ఈ చెట్టు బెరడుతో చేసిన కషాయంతో యోనిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా తెల్లబట్ట సమస్య తగ్గుతుంది.
నల్ల తుమ్మ చెట్టు ఆకులను మెత్తగా నూరాలి. దీనిని రోజుకు రెండు పూటలా పది గ్రాముల మోతాదులో తీసుకోవడం వల్ల రక్త మొలల సమస్య తగ్గుతుంది. ఈ చిట్కాను వాడుతూ ఉప్పు, కారం వంటి వాటిని తక్కువగా తీసుకుంటూ పత్యం చేయాలి. నల్ల తుమ్మ చెట్టు బెరడును పొడిగా చేసి రోజుకు రెండు పూటలా నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరం బలంగా తయారవుతుంది. తుమ్మ ఆకులను వాము , జీలకర్ర కలిపి కషాయంలా చేసుకుని తాగితే డయేరియా సమస్య తగ్గుతుంది. ఈ విధంగా నల్ల తుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.