భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉండే హిందువులు కూడా తులసి మొక్కలను తమ ఇళ్లలో పెంచుకుంటుంటారు. కొందరు పూజలు చేయకున్నా తులసి మొక్కలను కావాలని చెప్పి పెంచుకుంటుంటారు. ఈ మొక్క ఆకుల వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. తులసి మొక్కకు చెందిన అన్ని భాగాలు మనకు ఉపయోగపడతాయి. ఆ మొక్క భాగాలను పలు ఆయుర్వేద మందులను తయారు చేయడంలో వాడుతారు. అయితే తులసి ఆకులను తీసుకోవడం వల్ల కూడా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
తులసి ఆకుల్లో విటమిన్ ఎ, కాల్షియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనారోగ్య సమస్యలను రాకుండా చూస్తాయి. తులసి ఆకులకు చెందిన ట్యాబ్లెట్లు కూడా మనకు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు వాడుకుంటే మంచిది. ఇక తులసిని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ (మూలికలకు రాణి) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ మొక్కలో అనేక ఔషధ గుణాలు దాగి ఉంటాయి మరి.
ఆయుర్వేద అండ్ ఇంటెగ్రెటివ్ మెడిసిన్ అనే జర్నల్‌లో తెలిపిన వివరాల ప్రకారం తులసి ఆకుల్లో యాంటీ డిప్రెస్సెంట్, యాంటీ యాంగ్జయిటీ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటిని నిత్యం తింటుంటే ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. కొందరికి నిత్యం 500 మిల్లీగ్రాముల మోతాదులో తులసి ఆకుల నుంచి తీసిన పదార్థాలను ఇచ్చారు. దీంతో వారిలో కొద్ది రోజులకు ఒత్తిడి, డిప్రెషన్ తగ్గినట్లు గుర్తించారు. అలాగే వారిలో మూడ్ మారి సంతోషంగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళనతో బాధపడేవారు తులసి ఆకులను తీసుకోవచ్చు.
తులసి ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అవి సహజసిద్ధమైన మందుల్లా పనిచేస్తాయి. దీంతో గాయాలు, దెబ్బలు, పుండ్లు వంటివి త్వరగా నయం అవుతాయి. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. తులసి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.
తులసి ఆకులను నిత్యం తినడం వల్ల నోటి సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన ఉండదు. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. వాటి సమస్యలు కూడా పోతాయి. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి అల్సర్లు, నోటి పూత తగ్గుతాయి.
తులసి ఆకుల నుంచి తీసిన పదార్థాలను కొందరికి 30 రోజుల పాటు ఇచ్చారు. దీంతో వారిలో 26.4 శాతం వరకు షుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల తులసి ఆకులతో టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుంది. అలాగే అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు.
తులసి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా సమస్యల నుంచి బయట పడవచ్చు. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆయా సమస్యలను తగ్గిస్తాయి. అలాగే కీళ్లను సురక్షితంగా ఉంచుతాయి.
తులసి ఆకులను నిత్యం తినడం వల్ల జీర్ణాశయంలో అధికంగా యాసిడ్లు ఉత్పత్తి అవడం తగ్గుతుంది. దీంతో గ్యాస్, అసిడిటీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే మ్యూకస్ పెరిగి జీర్ణాశయం గోడలు సురక్షితంగా ఉంటాయి. తులసి ఆకుల నుంచి తీసిన పదార్థాలను 200 ఎంజీ మోతాదులో కొందరికి ఇచ్చి అనంతరం కొన్ని రోజులకు పరీక్షించి చూడగా వారిలో అల్సర్లు తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల అల్సర్లు ఉన్నవారు నిత్యం తులసి ఆకులను తినవచ్చు.
తులసి ట్యాబ్లెట్లు మనకు మార్కెట్‌లో సాధారణంగా క్యాప్సూల్స్ రూపంలో లభిస్తాయి. వాటిని 300 ఎంజీ నుంచి 2000 ఎంజీ మోతాదులో నిత్యం తీసుకోవచ్చు. అయితే 600 ఎంజీ నుంచి 1800 ఎంజీ మధ్య తీసుకునేట్లయితే వాటిని రోజుకు 3 చిన్న డోసులుగా విభిజించి తీసుకోవాలి. ఇక ఈ ట్యాబ్లెట్లను వైద్యుల సూచన మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే తులసి ఆకులతో టీ తయారు చేసుకుని తాగినా లాభాలను పొందవచ్చు.