Indigestion : జీర్ణ సమస్యలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. చాలా మంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదని చెబుతుంటారు. చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల జీర్ణశక్తిని పెంచుకోవచ్చు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటంటే..
1. తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. కొన్ని సార్లు జీర్ణాశయంలో యాసిడ్లు అధికంగా ఉత్పత్తి అవడం వల్ల కూడా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. అలాంటి సమయంలో ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
2. భోజనం చేసిన అనంతరం ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. రాత్రి పూట ఇలా చేయాలి. జీర్ణశక్తి పెరుగుతుంది.
3. భోజనం చేయడానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం సేవించాలి. రోజుకు 3 పూటలా ఇలా చేయాలి. దీంతో 3 రోజుల్లో జీర్ణశక్తి మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
4. భోజనం అనంతరం సోంపు గింజలను నోట్లో వేసుకుని నములుతుండాలి. దీని వల్ల కూడా ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ కూడా ఉండవు.
5. నాలుగు, ఐదు పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో రోజుకు రెండు సార్లు తాగాలి. ఇలా పుదీనా హెర్బల్ టీని తాగుతుంటే జీర్ణ శక్తి పెరుగుతుంది.
6. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక కప్పు మోతాదులో వాము నీళ్లను తాగుతుంటే జీర్ణ సమస్యలన్నీ తగ్గుతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ వాము గింజలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం వచ్చే నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. ఇలా పరగడుపునే రోజూ తాగుతుంటే అన్ని రకాల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
7. వాము నీళ్లలాగే ధనియాలు లేదా జీలకర్ర నీళ్లు కూడా పనిచేస్తాయి. పరగడుపునే ఈ నీళ్లను కూడా తాగవచ్చు. జీర్ణ శక్తి పెరుగుతుంది.
8. రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ జ్యూస్‌ను సేవించాలి. ఇలా రోజూ తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.