Acidity Home Remedies : మనలో చాలా మంది తరచూ అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. వాటిల్లో జీర్ణ సమస్యలు కూడా ఒకటి. ముఖ్యంగా కడుపు ఉబ్బరంతోపాటు కడుపులో మంటతో చాలా మంది అవస్థ పడుతుంటారు. అయితే ఈ సమస్యలు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. భోజనం సరిపోయినంత చేయకపోవడం, వేళకు తినకపోవడం, కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం, పెయిన్ కిల్లర్స్‌ను అధికంగా వాడడం, ఇన్‌ఫెక్షన్లు.. ఇలా అనేక కారణాల వల్ల అసిడిటీ వస్తుంటుంది. అలాగే ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఈ సమస్యల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరినీళ్లు కడుపులో మంటను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పూటకు 300 ఎంఎల్ చొప్పున కొబ్బరి నీళ్లను మూడు పూటలా తాగాలి. భోజనం చేసిన అనంతరం ఒక గంట విరామం ఇచ్చి ఈ నీళ్లను తాగాల్సి ఉంటుంది. దీంతో కడుపులో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం కూడా ఉండవు. ఒక్కోసారి శరీరంలో వేడి వల్ల కూడా కడుపులో మంటగా ఉంటుంది. కనుక కొబ్బరి నీళ్లను తాగితే వేడి తగ్గుతుంది. దీంతో కడుపులో మంట నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలా కడుపులో మంటకు కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కనుక వీటిని తీసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఇక కడుపులో మంటను తగ్గించడంలో అరటిపండు కూడా బాగానే పనిచేస్తుంది. అయితే దీన్ని నేరుగా తినకూడదు. ఎండబెట్టాలి. అనంతరం పొడి చేయాలి. దీన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవాలి. అనంతరం ఈ పొడిని అర కప్పు పాలలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా తీసుకోవాలి. దీంతో కడుపులో మంట తగ్గుతుంది. అలాగే సోంపు, జీలకర్ర, ధనియాలను విడి విడిగా దోరగా వేయించి మెత్తని పొడిగా చేయాలి. అనంతరం ఈ పొడులను కలపాలి. ఈ మిశ్రమాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి. కడుపులో మంటగా అనిపించినప్పుడల్లా అర టీస్పూన్ చొప్పున తీసుకుని నోట్లో వేసి చప్పరించి మింగాలి. ఇలా చేస్తున్నా కూడా కడుపులో మంట తగ్గుతుంది.
ఇక వాము పొడి రెండు భాగాలు, వంట సోడా ఒక భాగం తీసుకుని కలిపి నిల్వ చేయాలి. ఈ మిశ్రమాన్ని మోతాదుకు అర టీస్పూన్ చొప్పున నోట్లో వేసుకుని గోరు వెచ్చని నీళ్లతో మింగేయాలి. లేదా వేయించిన జీలకర్ర పొడికి అంతే మొత్తంలో చక్కెర కలిపి నిల్వ చేసుకుని పరగడుపునే అర టీస్పూన్ చొప్పున తీసుకుంటుండాలి. దీని వల్ల కూడా సమస్య తగ్గుతుంది. దీంతోపాటు అల్లం రసం, నిమ్మరసం, తేనెలను 1 టీస్పూన్ చొప్పున తీసుకుని కలిపి ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. ఇక తులసి ఆకులను రాత్రంతా నీటిలో వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను పరగడుపునే తాగుతున్నా కూడా కడుపులో మంట తగ్గుతుంది. కరివేపాకును ఎండబెట్టి పొడి చేసి దాన్ని భోజనంలో మొదటి ముద్దలో కలిపి తింటుండాలి. దీంతో సమస్త జీర్ణ సమస్యలు పోతాయి. ముఖ్యంగా మంట తగ్గుతుంది. ఇలా పలు చిట్కాలతో జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.