మన దేశంలో మధుమేహంతో సుమారుగా 7 కోట్ల మంది బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. యుక్త వయస్సులో ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు. వంశ పారంపర్యంగా వచ్చే టైప్ 1 డయాబెటిస్‌తోపాటు అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల వచ్చే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు కూడా మన దేశంలో ఏటా పెరిగిపోతున్నారు. దీంతో భారత్ డయాబెటిస్‌కు ప్రపంచ రాజధానిలా మారింది. అయితే డాక్టర్లు సూచించిన మేర నిత్యం మందులను వాడుకోవడంతోపాటు వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చేస్తే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. షుగర్ లెవల్స్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు కాకరకాయను ఎలాగైనా తీసుకోవచ్చు. దీన్ని నేరుగా తినలేం అనుకునే వారు జ్యూస్, పొడి, ట్యాబ్లెట్ల రూపంలోనూ తీసుకోవచ్చు. అవన్నీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. డయాబెటిస్‌ను తగ్గించేందుకు అవి అద్భుతంగా పనిచేస్తాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 20 ఎంఎల్ మోతాదులో కాకరకాయ జ్యూస్‌ను తాగాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ కాకరకాయ పొడిని కలుపుకుని తాగాలి. లేదంటే నిత్యం ఉదయం, సాయంత్రం ఆహారం తీసుకునే ముందు డాక్టర్ సూచన మేరకు కాకరకాయ ట్యాబ్లెట్లను కూడా వేసుకోవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
భారతీయులు దాల్చిన చెక్కను ఎంతో పురాతన కాలం నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. డయాబెటిస్‌ను తగ్గించేందుకు దాల్చిన చెక్క కూడా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ దాల్చినచెక్క పొడిని కలిపి తాగాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్కకు చెందిన ట్యాబ్లెట్లను కూడా విక్రయిస్తున్నారు. వాటిని కూడా డాక్టర్ల సూచన మేరకు వాడుకోవచ్చు.
మధుమేహాన్ని తగ్గించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. మెంతుల వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలను శరీరం నెమ్మదిగా శోషించుకుంటుంది. దీంతో ఆహారాలను తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. దీనివల్ల షుగర్ అదుపులో ఉంటుంది. నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ మెంతుల పొడిని కలుపుకుని తాగితే డయాబెటిస్ తగ్గుతుంది. లేదా 1 టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినాలి. అనంతరం వాటిని నానబెట్టిన నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే షుగర్ అదుపులోకి వస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాదు, చర్మం, వెంట్రుకల సమస్యలు ఉన్నవారికి కూడా ఉసిరికాయలు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో మెటబాలిక్ రేటు సరిగ్గా ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఉసిరికాయల్లో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులను రాకుండా చూస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 20 ఎంఎల్ మోతాదులో ఉసిరికాయ రసం తాగాలి. లేదా పూటకు రెండు లేదా మూడు ఉసిరికాయలను అలాగే తినవచ్చు. ఉసిరికాయల నుంచి తీసిన పదార్థాలతో చేసిన ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా డాక్టర్ సూచన మేరకు వాడుకోవచ్చు. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
మధుమేహాన్ని తగ్గించేందుకు తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి. అలాగే తిప్పతీగలో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. పిండి పదార్థాలపై ఆశ సన్నగిల్లుతుంది. క్లోమగ్రంథిలో బీటా కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
రాగినే తామ్రం అంటారు. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తామ్ర జలం అని పిలుస్తారు. రాత్రంతా రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని 2 నుంచి 3 గ్లాసుల మోతాదులో తాగాలి. ఈ విధంగా రోజూ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది.
నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు కొద్ది రోజులకు షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక రోజూ వాకింగ్ చేస్తే మంచిది. కుదిరితే 1 గంట సేపు వాకింగ్ చేయాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు మరింత మెరుగవుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.