Banana Water : మనం ఇప్పుడు నిత్యం గడుపుతోంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం. రోజూ అనేక సందర్భాల్లో ఒత్తిళ్లను, ఆందోళనలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మానసికంగా వ్యాకులత చెంది అనేక అనారోగ్యాలకు కూడా గురవుతున్నాం. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది నిద్రలేమి. అవును, కారణాలేమున్నా నిద్రలేమి సమస్య ఇప్పుడు మనలో అధిక శాతం మందిని బాధిస్తోంది. దీన్ని తగ్గించుకోవడం కోసం నిద్రమాత్రలు, మద్యం సేవించడం వంటి దురలవాట్లకు మనం దగ్గరవుతున్నాం. వీటి వల్ల మరిన్ని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం.
అయితే ఇప్పుడు నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టేలా ఓ అద్భుతమైన చిట్కాతో నిత్యం చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు, దాల్చిన చెక్క పొడిలను ఉపయోగించి చేసే ఓ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రోజూ చక్కగా నిద్ర పడుతుంది. ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావల్సిన పదార్థాలు..
తొక్కతీయని అరటి పండు – 1, నీరు – మరిగించడానికి సరిపడా, దాల్చిన చెక్క పొడి – చిటికెడు, షుగర్ ఫ్రీ చక్కెర – రుచికి సరిపడా (అవసరం అనుకుంటేనే).
తయారు చేసే విధానం..
అరటి పండును తొక్కతో సహా అలాగే శుభ్రంగా కడిగి పైన, కింది భాగాల్లో కట్ చేయాలి. అనంతరం ఒక చిన్న పాత్రలో మంచినీటిని తీసుకోవాలి. అందులో అంతకు ముందు సిద్ధం చేసుకున్న అరటి పండును వేయాలి. ఈ నీటిని 10 నిమిషాల పాటు మీడియం మంటపై మరిగించాలి. నీరు మరిగాక వడకట్టాలి. అనంతరం దాంట్లో దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి. రుచి కోసం కొద్దిగా షుగర్ ఫ్రీ చక్కెరను వేసుకోవచ్చు. సాధారణ చక్కెర వాడకూడదు. ఈ నీటిని రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు తాగాలి. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. అంతేకాదు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ నీరు బాగానే పనిచేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. ఇలా ఈ డ్రింక్‌తో ప్రయోజనాలను పొందవచ్చు.