Eyebrows : మన ముఖం అందంగా కనబడేలా చేయడంలో కనుబొమ్మలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఎంతటి అందమైన ముఖమైనా కనుబొమ్మలు అందంగా లేకుంటే ముఖం నీరసంగా కనిపిస్తుంది. చాలా మందికి కనుబొమ్మలు పలుచగా, తక్కువగా ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కనుబొమ్మలు పలుచగానే ఉంటాయి. ఈ కనుబొమ్మలను కొన్ని వంటింటి చిట్కాలను ఉపయోగించి ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. కనుబొమ్మలను ఒత్తుగా పెంచే వంటింటి చిట్కాలు ఏమిటి.. ఈ చిట్కాలను ఎలా వాడాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆముదం.. ఇది మనందరికీ తెలిసిందే. ఆముదం చిక్కగా ఉంటుంది. ఆముదం నూనెలో దూదిని ముంచి రోజూ రాత్రి పడుకునే ముందు కనుబొమ్మల మీద రాయాలి. ఉదయాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆముదంలో ఉండే పోషకాలు కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి. ఇలా క్రమం తప్పకుంగా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. అంతేకాకుండా ఆముదంలో ఉండే పోషకాలు చర్మానికి కాంతిని కూడా ఇస్తాయి.
కనుబొమ్మలను ఒత్తుగా పెరిగేలా చేయడంలో కలబంద గుజ్జు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జును కనుబొమ్మల మీద రాసి సున్నితంగా మర్దనా చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఉల్లిపాయ రసాన్ని ఉపయోగించి కూడా మనం కనుబొమ్మలు ఒత్తుగా పెరిగేలా చేయవచ్చు. ఉల్లిపాయ రసంలో దూదిని ముంచి కనుబొమ్మలపై రాయాలి. ఇలా రాసిన గంట తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
అదే విధంగా బాదం నూనెను రోజూ కనుబొమ్మల మీద రాసి నూనె చర్మంలోకి ఇంకేలా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. ఆలివ్ నూనె కూడా కనుబొమ్మలను ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఆలివ్ నూనెను కనుబొమ్మల మీద రాసి 10 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ నూనెలో ఉండే పోషకాలు కనుబొమ్మలను నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అలాగే పచ్చిపాలల్లో దూదిని ముంచి కనుబొమ్మల మీద రాయాలి. గంట తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
పలుచటి కనుబొమ్మలు కలిగిన వారు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను ఉపయోగించినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కనుబొమ్మలను ఒత్తుగా, మెరిసేలా చేస్తాయి. విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వాడడం వల్ల కూడా కనుబొమ్మలను ఒత్తుగా మార్చుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా, అందంగా, నల్లగా మారుతాయి.