Beauty Tips : చాలా మందికి అనేక చర్మ సమస్యలు ఉంటాయి. కొందరికి ఎండలో తిరిగితే ముఖం నల్లగా మారుతుంది. కొందరికి మొటిమలు, మచ్చలు అధికంగా వస్తుంటాయి. కొందరికి కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. అయితే వీటన్నింటికీ ఒకే దెబ్బతో చెక్ పెట్టవచ్చు. అందుకు గాను ముల్తానీ మట్టి ఎంతగానో సహాయపడుతుంది. దాంతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ ల ముల్తానీ మట్టిని తీసుకొని అందులో టేబుల్‌స్పూన్ చొప్పున పెరుగు, కీరదోస తురుము, రెండు చెంచాల శనగ పిండి వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోసుకుంటూ మెత్తని మిశ్రమంలా చేసుకుని ముఖం, మెడ చుట్టూ పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లని లేదా గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ చర్మాన్ని మెరిపిస్తుంది.
2. బ్లాక్ హెడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే రెండు టేబుల్ స్పూన్ ల ముల్తానీ మట్టి, టేబుల్ స్పూన్ పెరుగు, ఒకటిన్నర చెంచాల నిమ్మరసం, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడకు ప్యాక్‌లా వేసుకుని బాగా ఆరనివ్వాలి. తరువాత తడి చేత్తో రుద్దుకుంటూ కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య నుండి బయట పడవచ్చు.
3. ఎండ వల్ల చర్మం రంగు మారుతుంది. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్‌ల ముల్తానీ మట్టిలో అంతే మోతాదులో బంగాళాదుంప గుజ్జును కలిపి సమస్య ఉన్న చోట రాయాలి. ఇది బాగా అరాక కడిగేసుకుంటే చాలు. రెండు టేబుల్ స్పూన్‌ల ముల్తానీ మట్టిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్‌ల కొబ్బరి నీళ్లు, పావు టేబుల్ స్పూన్ చక్కెర వేసుకుని అన్నింటినీ బాగా కలపాలి. దాన్ని ముఖం, మెడకు పట్టించాలి. పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే టాన్ ఇట్టే తగ్గుతుంది.
4. గుడ్డు తెల్లసొనలో రెండు టేబుల్ స్పూన్ ల ముల్తానీ మట్టి, కొద్దిగా నీరు పోసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై ఐదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే చర్మం బిగుతుగా తయారవుతుంది. యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా మారుతుంది.
5. ఎండాకాలంలో కొందరి చర్మం పొడిబారినట్లు ఉంటుంది. అలాంటప్పుడు రెండు టేబుల్ స్పూన్‌ల ముల్తానీ మట్టిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం, చెంచా గులాబీ నీరు చేర్చి బాగా కలిపి రాసుకోవాలి. అర గంట తరువాత కడిగేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.