Dark Spots : మంగు మచ్చలు.. మనల్ని వేధించే చర్మ సంబంధిత సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఇవి ఎక్కువగా బుగ్గలు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. స్త్రీ, పురుషులిద్దరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖంపై మంగు మచ్చలు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత, వయసు పైబడడం, ఎండలో ఎక్కువగా తిరగడం, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వంటి వివిధ కారణాల చేత ముఖంపై మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. మంగు మచ్చల వల్ల మనకు ఎటువంటి నష్టం కలగనప్పటకి వీటి కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.
చాలా మంది మంగు మచ్చలు కనబడకుండా ఉండడానికి వాటిపై పౌడర్ ను, వివిధ రకాల క్రీములను రాస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా మనం ఈ మంగు మచ్చలను నివారించుకోవచ్చు. మంగు మచ్చలను నివారించడంలో మనకు బంగాళాదుంప చక్కగా పని చేస్తుంది.దీని కోసం బంగాళాదుంపను అడ్డంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఇలా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కను తీసుకుని మచ్చలపై బాగా రుద్దాలి. ఇలా 10 నిమిషాల పాటు బంగాళాదుంప ముక్కతో మచ్చలపై సున్నితంగా రుద్దాలి. తరువాత దీనిని పూర్తిగా ఆరే వరకు అలాగే ఉంచాలి. తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా బంగాళాదుంపలతో రుద్దడం వల్ల ఆ భాగంలో చర్మం చల్లగా మారడంతో పాటు రక్తప్రసరణ కూడా ఎక్కువగా జరుగుతుంది.
దీంతో ఆ భాగంలో మలినాలు తొలగిపోవడంతో పాటు దెబ్బతిన్న చర్మ కణాలు కూడా సాధారణ స్థితికి వస్తాయి. దీని వల్ల ఆ భాగంలో చర్మం త్వరగా సాధారణ రంగులోకి వస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చాలా సులభంగా మనం మంగు మచ్చలను తగ్గించుకోవచ్చు. మంగు మచ్చలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా సులభంగా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సమస్య నుండి బయటపడవచ్చు.