Pimples : మనల్ని వేధించే అనేక రకాల చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. మొటిమలు అలాగే వాటి వల్ల ఏర్పడిన మచ్చల కారణంగా ముఖం చూడడానికి అందంగా కనిపించదు. చర్మంపై మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాతావరణ కాలుష్యం, జిడ్డు చర్మం, హార్మోన్ల అసమతుల్యత, జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకోవడం వంటి వాటిని మనం మొటిమలు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. కొన్ని రకాల చిట్కాలను పాటించడం వల్ల మొటిమల సమస్య నుండి మనం చాలా సులభంగా బయట పడవచ్చు. ముఖంపై వచ్చే మొటిమలను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలు, వాటి వల్ల కలిగే వాపు, ఇన్ ఫెక్షన్, ఎరుపుదనం వంటి వాటిని ఐస్ థెరపీని ఉపయోగించి తగ్గించుకోవచ్చు. ఈ థెరపీ వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా చర్మంపై దుమ్ము, ధూళి, జిడ్డు తొలపోతాయి. ఒక చిన్న ఐస్ ముక్కను వస్త్రంలో ఉంచి మొటిమలపై కొన్ని సెకన్ల పాటు ఉంచాలి. ఇలా కొన్ని సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మొటిమలను తగ్గించే మరో పద్ధతి ఆవిరి పట్టడం. ముఖానికి ఆవిరి పట్టడం అనేది ఒక మంచి పద్ధతి అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుని మలినాలు తొలగిపోతాయి.
ముఖానికి ఆవిరి పట్టిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకుని మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మొటిమలు తొలగిపోతాయి. అదే విధంగా మొటిమలను తగ్గించడంలో తెల్లగా ఉండే టూత్ పేస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దంతాలను శుభ్రపరిచే టూత్ పేస్ట్ మొటిమలను కూడా తొలగిస్తుందని మనలో చాలా మందికి తెలిసి ఉండదు. మొటిమలతో బాధపడే వారు తెల్లగా ఉండే ఏదో ఒక టూత్ పేస్ట్ ను తీసుకుని మొటిమలపై రాయాలి. దీనిని 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలతోపాటు వాపు కూడా తగ్గిపోతుంది.
అదే విధంగా కోడిగుడ్డులోని తెల్లసొన కూడా మనకు మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. కోడిగుడ్డులోని తెల్ల సొనను తీసుకుని ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరే వరకు అలాగే ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలతోపాటు మచ్చలు కూడా తొలగిపోతాయి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండే అల్లాన్ని ఉపయోగించి కూడా మనం మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు. అల్లం రసాన్ని మొటిమలపై రాసి ఆరిన తరువాత కడిగేయాలి. మరలా అల్లం ముక్కను మొటిమలపై ఉంచాలి. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా మొటిమల సమస్య తగ్గు ముఖం పడుతుంది. ఈ విధంగా మనకు అందుబాటులో ఉండే వాటిని ఉపయోగించి మనం చాలా సులభంగా మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు.