Dandruff : ప్రస్తుత తరుణంలో చాలా మంది చుండ్రు సమస్యతో అవస్థలు పడుతున్నారు. చుండ్రు కారణంగా తలలో దురద కూడా వస్తోంది. దీంతో ఇంకా ఇబ్బంది కలుగుతోంది. చుండ్రు వచ్చేందుకు కారణాలు ఏమున్నప్పటికీ ఇది ఉందంటే మాత్రం విసుగ్గా అనిపిస్తుంటుంది. మాటిమాటికీ తలలోకి చేయి పోతుంటుంది. అయితే ఏం చేసినా చుండ్రు పోవడం లేదని విచారం వ్యక్తం చేసేవారు కింద తెలిపిన చిట్కాలను పాటించి చూడండి. దెబ్బకు చుండ్రు మొత్తం పోతుంది. మళ్లీ తిరిగి రాదు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు అందరికీ అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజూ ఆహారంలో తీసుకుంటుంటారు. అయితే ఇది చుండ్రును తగ్గించగలదు. అందుకు గాను పెరుగును పులియబెట్టాలి. పుల్లని పెరుగును ఒక కప్పు మోతాదులో తీసుకుని జుట్టుకు బాగా పట్టించాలి. ఒక గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే చుండ్రు తప్పక నశిస్తుంది. మళ్లీ రాదు.
నిమ్మరసం కూడా చుండ్రు సమస్యను తగ్గించగలదు. అయితే దీన్ని నేరుగా వాడరాదు. ఇందులో కాస్త కొబ్బరినూనెను కలపాలి. నిమ్మరసం, కొబ్బరినూనెలను సమాన భాగాల్లో కలిపి మిశ్రమంలా చేసి తలకు బాగా పట్టించాలి. గంట సేపయ్యాక తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.
చుండ్రును తగ్గించడంలో గ్రీన్ టీ కూడా బాగానే పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తగ్గించగలవు. దురద నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అందుకు గాను ఒక కప్పు వేడి నీటిలో రెండు గ్రీన్ టీ బ్యాగులను లేదా 2 టీస్పూన్ల గ్రీన్ టీ పొడిని వేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత నీటిని వడకట్టి దాన్ని జుట్టుకు బాగా రాయాలి. గంట సేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేసినా చాలు.. చుండ్రు నుంచి విముక్తి లభిస్తుంది.