Pimples : మనలో చాలా మందిని వేధిస్తున్న చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. యుక్త వయసులో ఉన్న వారిని ఈ సమస్య మరీ ఎక్కువగా బాధిస్తుంది. జిడ్డు చర్మం, హార్మోన్ల అసమతుల్యత, వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం వంటి వాటి వల్ల మొటిమల సమస్య తలెత్తుంది. ఈ సమస్య నుండి బయట పడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల ఫేస్ వాష్ లను, క్రీములను, స్క్రబర్ లను వాడినప్పటికీ ఫలితం లేక బాధపడే వారు చాలా మందే ఉన్నారు.
మొటిమల కారణంగా ముఖం అందవిహీనంగా కనడబతుంది. దీంతో చాలా మంది ఆత్మనూన్యత భావనకు గురవుతూ ఉంటారు. సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే పేస్ట్ చేసుకుని వాడడం వల్ల మొటిమల సమస్య నుండి మనం త్వరగా బయటపడవచ్చు. మొటిమల సమస్యను నయం చేసే ఈ పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం మనం వేప ఆకుల పొడిని, ముల్తానీ మట్టిని, గులాబీ నీరును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిని, ఒక టీ స్పూన్ వేప ఆకుల పొడిని వేయాలి. తరువాత తగినన్ని గులాబీ నీటిని పోస్తూ పేస్ట్ లా చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న పేస్ట్ ను మొటిమలు ఉన్న చోట మాత్రమే రాయాలి. ఇలా రాసిన 20 నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో కడిగేయాలి. ఇలా రోజులో ఎన్నిసార్లైనా ఈ పేస్ట్ ను మనం మొటిమల మీద రాసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు చాలా త్వరగా తగ్గుతాయి. ఇదే విధంగా మొటిమలను తగ్గించే మరో ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ చందనం పొడిని, ఒక టీ స్పూన్ కలబంద గుజ్జును తీసుకోవాలి. ఇందులోనే తగినన్ని గులాబీ నీటిని పోస్తూ పేస్ట్ లా చేసుకోవాలి.
ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకుని ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల కూడా ముఖంపై వచ్చే మొటిమలతోపాటు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తగ్గుతాయి. చందనం పొడి అందుబాటులో లేని వారు దానికి బదులుగా శనగపిండిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల ముఖంపై ఉన్న మొటిమలు తగ్గడంతోపాటు కొత్త మొటిమలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా చర్మం అందంగా, మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.