Burning In Urine : మన శరీరంలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తాన్ని మన రెండు మూత్రపిండాలు గంటకు రెండు సార్లు శుద్ది చేస్తూ ఉంటాయి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. రక్తంలో ఉండే మలినాలను, విష పదార్థాలను, లవణాలను మూత్రపిండాలు బయటకు పంపిస్తూ ఉంటాయి. వీటన్నింటిని కూడా మూత్రం ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. మూత్రం ఎక్కువగా వచ్చినప్పుడు ఈ వ్యర్థాలన్నీ మూత్రంలో కలిసి గాఢత తక్కువగా ఉంటుంది. అదే మూత్రం తక్కువగా తయారైనప్పుడు ఈ వ్యర్థాలు మూత్రంలో కలిసి మూత్రం గాఢత పెరుగుతుంది. ఇలా గాఢత పెరగడం వల్ల మూత్రం మండుతుంది. మూత్రం పోసిన తరువాత కూడా మంట పెడుతుంది. మూత్రంలో మంట రాగానే చాలా మంది వేడి చేసిందని భావిస్తూ ఉంటారు.
కొందరిలో ఈ సమస్య అప్పుడప్పుడూ కనిపిస్తే కొందరిలో తరుచూ కనిపిస్తుంది. అలాగే ఈ సమస్య స్త్రీలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య నుండి బయట పడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పంచదార నీటిని తాగడం, సబ్జా గింజల నీటిని తాగడం, మజ్జిగ తాగడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇవి అన్ని కూడా నీరు ఎక్కువగా ఉండే పదార్థాలు మాత్రమే అనీ కానీ నీరు కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య తగ్గాలంటే మనం నీటిని ఎక్కువగా తాగాలని వారు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో మూత్రం ఎక్కువగా తయారవుతుంది. మూత్రం ఎక్కువగా తయారవ్వడం వల్ల వ్యర్థాల గాఢత తగ్గి మంట తగ్గుతుంది. మన కంటికి మనం విసర్జించే మూత్రం ఎప్పుడూ తెల్లగా కనిపించాలి.
నీటిని తక్కువగా తాగడం వల్ల మూత్రం యొక్క గాఢత పెరిగి మూత్రవిసర్జన సమయంలో మంట ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ భాగంలో ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇన్పెక్షన్ లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక నీటిని ఎక్కువగా తాగడం వల్ల ఈ సమస్య నుండి మనం బయట పడవచ్చు. అలాగే సమస్య మన దరి చేరకుండా చూసుకోవచ్చు. మూత్రంలో మంట సమస్య మనకు రాకుండా ఉండాలంటే మనం రోజూ ఉదయం పరగడుపున లీటర్ నీటిని తాగాలి. మరలా గంట తరువాత మరో లీటర్ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల ఉదయం 11 గంటల వరకు మరలా నీటిని తాగే అవసరం ఉండదు.
11 గంటల తరువాత అరగంట లేదా గంటకు ఒక గ్లాస్ చొప్పున నీటిని తాగుతూ ఉండాలి. అలాగే మధ్యాహ్నం భోజనం చేస్తూ చాలా మంది నీటిని తాగుతూ ఉంటారు. కానీ మధ్యాహ్నం భోజనం చేస్తూ నీటిని తాగకూడదు. భోజనం చేసిన రెండు గంటల తరువాత నీటిని తాగాలి. ఇలా మరలా సాయంత్రం భోజనం చేసే వరకు తాగుతూ ఉండాలి. ఇలా రోజుకు 4 లీటర్ల నీటిని తాగడం వల్ల మూత్రంలో మంట, ఇన్పెక్షన్ వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయన నిపుణులు చెబుతున్నారు.