Carrot Oil : చర్మంపై రకరకాల అలర్జీలతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాగే కొందరిలో ఊబకాయం కారణంగా తొడలు, పిరుదులు, చంకల భాగంలో దురదలు వస్తూ ఉంటాయి. అలాగే మరికొందరిలో షేవింగ్ క్రీమ్ ల కారణంగా, హెయిర్ డైల కారణంగా, వివిధ రకాల సౌందర్య సాధనాల వల్ల దురదలు వస్తూ ఉంటాయి. అలాగే వివిధ రకాల చర్మ సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా కూడా దురదలు వస్తూ ఉంటారు. కారణాలేవైనప్పటికి ఈ దురదల కారణంగా కలిగే బాధ అంతా ఇంతా కాదు. దురదల సమస్య నుండి బయట పడడానికి రకరకాల లోషన్ లను, క్రీములను, మందులను వాడుతూ ఉంటారు. కేవలం మందులతోనే కాకుండా సహజ సిద్దంగా కూడా మనం చర్మంపై వచ్చే దురదలను తగ్గించుకోవచ్చు.
దురదలను తగ్గించడంలో మనకు క్యారెట్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 10 ఎమ్ ఎల్ క్యారెట్ ఆయిల్ ధర 400 రూ. ల వరకు ఉంటుంది. ధర ఎక్కువైనప్పటికి ఈ నూనెను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ క్యారెట్ నూనె ఎటువంటి దురదలనైనా తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా తెలియజేసారు. 2015 వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కొయంబ్రా, పోర్చుగల్ దేశం వారు జరిపిన పరిశోధనల్లో క్యారెట్ నూనె దురదలను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడైంది. క్యారెట్ ఆయిల్ ఉండే ఎ పి టి ఎస్ అనే రసాయన సమ్మేళనం చర్మంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి చర్మంలో ఉండే ఇన్ ప్లామేషన్ ను త్వరగా తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది రకరకాల రసాయనాలతో కూడిన ఆయింట్ మెంట్స్ ను, క్రీములను చర్మం పై రాస్తూ ఉంటారు. రసాయనాలు కలిగిన మందులను, ఆయింట్ మెంట్ లను వాడడానికి బదులుగా క్యారెట్ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కొందరిలో తినకూడని పదార్థాలు తినప్పుడు, దోమలు కుట్టినప్పుడు దురదలు వచ్చి ఈ క్యారెట్ ఆయిల్ ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో తీసుకుని దురద ఉన్న చోట చర్మం పై రాయడం వల్ల దురదలు వెంటనే తగ్గుతాయి. దురదలను తగ్గించుకోవడానికి క్యారెట్ ఆయిల్ శాశ్వత పరిష్కారం కానప్పటికి దీనిని వాడడం వల్ల తక్షణ ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తూనే నీటిని ఎక్కువగా తాగడం, జ్యూస్ లను ఎక్కువగా తాగడం, స్టీమ్ బాత్ వంటి వాటిని చేయడం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయడం వల్ల దురదలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.