Kidneys : మన శరీరంలోని అనేక అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి రోజూ అనేక విధులను నిర్వర్తిస్తుంటాయి. మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు శరీరంలో ఉత్పన్నం అయ్యే వ్యర్థాలను వడబోసి బయటకు పంపిస్తుంటాయి. ఈ క్రమంలోనే కిడ్నీలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. కనుక వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ మనం పాటించే పలు అలవాట్ల వల్ల కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోతుంటాయి. అవి కిడ్నీ స్టోన్స్ గా మారుతుంటాయి. దీంతోపాటు కొందరికి మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కనుక ఇలా జరగకుండా ఉండాలంటే కిడ్నీలను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
1. చాలా మంది రోజూ సరిగ్గా నీళ్లను తాగరు. తగినంత నీటిని తాగకపోయినా కిడ్నీలు అనారోగ్యంగా మారుతాయి. కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోవు. కనుక కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్ట మొదట చేయాల్సిన పని.. రోజూ తగినంత నీటిని తాగడం. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీటిని తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యర్థాలు చాలా వరకు బయటకు పోతాయి.
2. కొత్తిమీర ఆకులు కిడ్నీలను శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే సమ్మేళనాలు కిడ్నీలను క్లీన్ చేస్తాయి. కనుక రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో కొత్తిమీర జ్యూస్‌ను తాగాలి. వారంలో కనీసం 3 సార్లు ఇలా తాగడం వల్ల కిడ్నీలు శుభ్రంగా ఉంటాయి. ఆరోగ్యంగా మారుతాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. కొత్తిమీర జ్యూస్‌ను తాగడం వల్ల పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక కప్పు మోతాదులో బీట్ రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల కూడా కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం పెరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది. అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
4. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. దీని వల్ల కూడా కిడ్నీలు శుభ్రంగా మారుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
5. గుమ్మడికాయ విత్తనాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతోపాటు అల్లం రసం కూడా మేలు చేస్తుంది. రోజూ పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తే కిడ్నీలు వాపులకు గురి కాకుండా ఉంటాయి.
మద్యం సేవించడం, పొగా తాగడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కనుక ఈ అలవాట్లను మానుకుంటే మంచిది. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు వాటిని ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే కిడ్నీలు ప్రభావితం అవుతాయి. కిడ్నీలు దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను కూడా నియంత్రణలో ఉంచుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
రోజూ తగినంత నీటిని తాగడంతోపాటు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు సరిగ్గానే ఉన్నవారు.. బరువు పెరగకుండా చూసుకోవాలి. దీంతో కిడ్నీలను సంరక్షించుకోవచ్చు.
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు పలు ఆహారాలకు దూరంగా ఉండాలి. చాకొలేట్, బెండకాయలు, చిలగడ దుంపలు, నువ్వులు, పాలకూర వంటి ఆహారాలను తీసుకోరాదు. లేదంటే కిడ్నీ స్టోన్స్ మళ్లీ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.