Coconut Oil For Hair Growth : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువువుతుందనే చెప్పవచ్చు. జుట్టు దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు విపరీతంగా జుట్టు రాలిపోతుందని చాలా మంది బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, రసాయనాలను ఎక్కువగా వాడడం, వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, మారిన మన జీవన విధానం వంటి అనేక కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. కొన్ని రకాల ఇంటి చిట్కాలను వాడడం వల్ల జుట్టు రాలడాన్ని మనం సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మనకు కొబ్బరి నూనె ఎంతగానో ఉపయోపగడుతుంది. వారినికి రెండు నుండి మూడు సార్లు జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా కొబ్బరి నూనెను రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు త్వరగా వస్తుంది. అదే విధంగా ఎండలో బయటికి వెళ్లినప్పుడు జుట్టుకు కొబ్బరి నూనె రాసుకుని వెళ్లడం మంచిది. దీని వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారినికి ఒకసారి జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా నువ్వుల నూనెను రాసుకోవాలి.
రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెను రాసుకుని ఉదయాన్నే కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది. అదే విధంగా మందార ఆకులను పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు పట్టులా మృదువుగా తయారవుతుంది. అలాగే మనం వాడే కొబ్బరి నూనెలో మందార పువ్వులను వేసి గోరు వెచ్చగా చేసి రాసుకున్నా కూడా జుట్టు రాలడం తగ్గుతుంది. అదే విధంగా జుట్టు రాలడం సమస్యతో బాధపడే వారు రసాయనాలు కలిగిన షాంపులకు బదులుగా కుంకుడు కాయ, షీకాకాయ వంటి వాటితో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ చిట్కాలను పాటించడం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడంతో పాటు జుట్టు మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. వీటితో పాటు జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలను అందించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాలతో పాటు నానబెట్టిన బాదం పప్పును, ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. వారానికి ఒకసారైనా తోటకూరను ఆహారంగా తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ సమస్య రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.