Constipation In Kids : పిల్లల్ని వేధించే వివిధ రకాల జీర్ణసమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా పిల్లలు వారానికి మూడు కంటే తక్కువ సార్లు విసర్జిస్తూ ఉంటారు. దీంతో పిల్లలకు తీవ్రమై ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది. మలబద్దకం కారణంగా కడుపులో నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుడి బయటపడడానికి పిల్లలకు మందులను, సిరప్ లను ఇస్తూ ఉంటారు. వీటికి బదులుగా కొన్ని చిట్కాలను వాడడం వల్ల పిల్లల్లో మలబద్దకం సమస్యను చాలా సులభంగా తగ్గించవచ్చు. పిల్లల్లో మలబద్దకం సమస్యను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకం సమస్యతో బాధపడే పిల్లలకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వాలి. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా ఇవ్వాలి.
ఆపిల్స్, అరటిపండ్లు, స్ట్రాబెర్రీ వంటివాటితో స్మూతీలను తయారు చేసి ఇవ్వాలి. ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను ఇవ్వడం వల్ల ప్రేగుల్లో కదలికలు ఎక్కువగా ఉంటాయి. మలవిసర్జన సులభంగా జరుగుతుంది. అలాగే పిల్లలు హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయనీరు వంటి వాటిని ఇవ్వాలి. తగినంత నీరు అందించడం వల్ల మలబ్దదకం సమస్య తగ్గుతుంది. అలాగే వారికి ప్రోబయోటిక్స్ తో కూడిన పెరుగును అందించాలి. ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే వారు రోజూ ఒకే సమయంలో మలవిసర్జనకు వెళ్లేలా అలవాటు చేయాలి. పిల్లలను రోజుకు రెండు సార్లు కనీసం 10 నిమిషాల పాటు మలవిసర్జనకు కూర్చోబెట్టాలి. అలాగే వారు మలవిసర్జన సమయంలో ఫోన్స్ వాడకుండా చూసుకోవాలి. ఇలా అలవాటు చేయడం వల్ల మలబద్దకం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
అలాగే పిల్లలకు రోజుకు రెండు పాలను ఆహారంగా ఇవ్వాలి. రోజూ ఉదయం గోరు వెచ్చని పాలను ఇవ్వాలి. అలాగే రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్షను ఇవ్వాలి. అదే విధంగా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో అర టీ స్పూన్ ఆవు నెయ్యి కలిపి ఇవ్వాలి. ఇలా చేయడం మలబద్దకం సమస్య సులభంగా తగ్గుతుంది. అలాగే పిల్లలకు ఉడికించిన ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాలను ఇవ్వాలి. జంక్ ఫుడ్ ను, స్నాక్స్, పంచదార ఉండే ఆహారాలను ఇవ్వడం తగ్గించాలి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల పిల్లల్లో మలబద్దకం సమస్యను చాలా సులభంగా తగ్గించవచ్చు. ఈ చిట్కాలను పాటించినప్పటికి సమస్య తగ్గకుండా మరీ తీవ్రంగా ఉంటే వైద్యున్ని సంప్రదించడం మంచిది.