Constipation Remedies : మనల్ని వేధించే జీర్ణసంబంధిత సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. మలబద్దకం సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. నీటిని తక్కువగా తాగడం, పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి, వాతావరణ మార్పులు, మారిన జీవన విధానం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వంటి వాటిని మలబద్దకం సమస్య తలెత్తడానికి కారణాలుగా చెప్పవచ్చు. అలాగే కొన్ని రకాల మందుల కారణంగా, వయసు మీద పడడం వల్ల కూడా ఈ సమస్య బారిన పడుతుంటారు.
అయితే చాలా మంది ఉదయం పూట మలవిసర్జన కాకపోతే దానిని ఒక రోగం లాగా భావిస్తారు. మలవిసర్జన కాకపోవడం వల్ల ఆందోళనకు గురి అయ్యి పనులను సరిగ్గా చేయలేకపోతుంటారు. కొంతమంది మలవిసర్జన అయ్యే వరకు ఉదయం పూట పనులను చేయడం కూడా మానేస్తారు. రోజంతా చికాకుగా ఉంటారు. రోజూ మలవిసర్జన చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి రోజూ మలవిసర్జన జరగకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు మూడు సార్లు మలవిసర్జన చేయడం అలాగే మూడురోజులకు ఒకసారి మలవిసర్జన చేయడం అనేది సాధారణమైన స్థితిగా వారు పేర్కొంటున్నారు.
మూడురోజులకు ఒకసారి కూడా మలవిసర్జన జరగకపోతే అప్పుడు దానిని మలబద్దకం సమస్యగా భావించాలని వారు చెబుతున్నారు. అదేవిధంగా ఈ సమస్య నుండి బయట పడాలంటే కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తాగాలి. తగినంత శారీర క శ్రమ ఉండేలా చూసుకోవాలి. కొందరిలో ఎన్నిచిట్కాలను పాటించినప్పటికి మలబద్దకం సమస్య అనేది తగ్గదు. వారం రోజులకు ఒకసారి, పది రోజులకు ఒకసారి మలవిసర్జన జరుగుతుంది. అలాంటి వారిలో మలం గట్టిపడడం, దుర్వాసనను వెదజల్లడం వంటివి కూడా జరుగుతుంటాయి.
అలాంటి వారు రోజూ రాత్రి పడుకునే ముందు ఒక టీస్పూన్ కొబ్బరినూనెను సేవించాలి. దీంతో మరుసటి రోజు ఉదయం మల విసర్జన సాఫీగా జరుగుతుంది. అలాగే రాత్రి పూట నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని కూడా తాగాలి. ఈ రెండు చిట్కాలను గనక పాటిస్తే మలం సాఫీగా బయటకు వస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. రోజూ మలవిసర్జన సహజంగా సాఫీగా సాగేలా చూసుకోవాలని అప్పుడే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.