Whiten Teeth : దంతాల సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. దంతాలు పసుపు రంగులో మారడం, చిగుళ్ల నుండి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన వంటి వాటిని మనం దంతాల సమస్యలుగా చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారం, ఒత్తిడి, జీవన విధానం వంటి అనేక అంశాలు మన దంతాల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. మార్కెట్ లో దొరికే అనేక టూత్ పేస్ట్ లు దంతాలను తెల్లగా మారుస్తాయి అని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వీటిలో రసాయనాలు అధికంగా ఉంటాయి. ఇవి దంతాలపై ఉండే ఎనామిల్ కు నష్టం కలిగిస్తాయి. ఈ టూత్ పేస్ట్ లను వాడడం వల్ల చిగుళ్లు కూడా బలహీనంగా తయారవుతాయి.
మన ఇంట్లోనే టూత్ పేస్ట్ ను తయారు చేసుకుని వాడడం వల్ల దంతాల మరియు చిగుళ్ల సమస్యల నుండి బయట పడడమే కాకుండా దంతాలు తెల్లగా కూడా మార్చుకోవచ్చు. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే టూత్ పేస్ట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టూత్ పేస్ట్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం బేకింగ్ సోడాను, కొబ్బరి నూనెను, పెప్పర్ మింట్ నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకోవాలి. తరువాత అందులో కొబ్బరి నూనె, పెప్పర్ మింట్ నూనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మనం గాజు సీసాలో ఉంచి నిల్వ చేసుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ తో తీసుకుని రోజూ వారిలా దంతాలను శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాడడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. వేడి, చల్లటి ఆహార పదార్థాలను తినప్పుడు చాలా మందిలో దంతాలు జివ్వుమంటాయి. అలాంటి వారు ఈ టూత్ పేస్ట్ ను వాడడం వల్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ టూత్ పేస్ట్ ను వాడడం వల్ల దంతాలు తెల్లగా కూడా మారతాయి. ఇదే కాకుండా దంతాల సమస్యలను తొలగించే మరికొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాలను తాగడం వల్ల తగినంత క్యాల్షియం లభించి దంతాలు ధృడంగా మారతాయి. దంతాలపై ఉండే ఎనామిల్ పొరను తెల్లగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
కానీ పాలు దంతాలకు చాలా సేపు అతుక్కుని ఉంటాయి. కనుక పాలు తాగిన వెంటనే దంతాలను శుభ్రంగా చేసుకోవాలి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండును తీసుకోవడం వల్ల దంతాల, చిగుళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే కాఫీ, టీ లు తాగిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల దంతాల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలాగే దంతాలు రంగు మారకుండా ఉంటాయి. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చక్కటి దంతాలను సొంతం చేసుకోవచ్చు.