Dal Makhani : దాల్ మఖనీ.. పంజాబీ వంటకమైన ఈ దాల్ మఖనీ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ వంటకం గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. పొట్టు మినపప్పును, రాజ్మాను ఉపయోగించి చేసే ఈ కూరను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. రెస్టారెంట్ స్టైల్ దాల్ మఖనీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే దాల్ మఖనీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెస్టారెంట్ స్టైల్ దాల్ మఖనీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు మినపప్పు – ముప్పావు కప్పు, రాజ్మా – పావు కప్పు, ఉప్పు – తగినంత, కారం – ఒకటిన్నర టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, టమాట ఫ్యూరీ – ఒక కప్పు, బటర్ – 50 గ్రా., ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు, కసూరి మెంతి – 2 టీ స్పూన్స్.
రెస్టారెంట్ స్టైల్ దాల్ మఖనీ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పొట్టు మినపప్పును, రాజ్మాను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని మరోసారి శుభ్రం చేసి కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. దీనిని మధ్యస్థ మంటపై 6 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తరువాత మూత తీసి గంటెతో పప్పును కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాట ఫ్యూరీని వేసి కలపాలి. ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి.
దీనిని నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసి కలపాలి. తరువాత ఇందులో అర కప్పు లేదా ముప్పావు కప్పు నీటిని పోసి కలిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత ఇందులో బటర్, ఫ్రెష్ క్రీమ్, కసూరి మెంతి వేసి కలపాలి. తరువాత మరలా మూత ఉంచి రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ దాల్ మఖనీ తయారవుతుంది. దీనిని పై ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసుకోవచ్చు. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ దాల్ మఖనీని తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో ఎన్నో రకాల పోషకాలను కూడా పొందవచ్చు.