Mehindi To Hair : జుట్టు అందంగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. జుట్టు నల్లగా, పొడవుగా, పట్టుకుచ్చులా ఉండాలిన కోరుకోవడంలో తప్పే లేదు. జుట్టు అందంగా కనబడడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది జుట్టు అందంగా, సిల్కీగా కనబడడానికి జుట్టుకు హెన్నాను రాస్తూ ఉంటారు. హెన్నాను చాలా మంది వాడుతూ ఉంటారు. అలాగే హెన్నాను వాడడం వల్ల జుట్టు అందంగా తయారవుతుందని చాలా కాలంగా ప్రాచుర్యంలో కూడా ఉంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో, జుట్టును పట్టుకుచ్చులా తయారు చేయడంలో హెన్నా మనకు ఎంతో సహాయపడుతుంది. అలాగే మనకు మార్కెట్ లో వివిధ రకాల హెన్నా లభిస్తూ ఉంటుంది. ప్రజలు వారికి నచ్చిన కంపెనీల హెన్నాను తెచ్చుకుని వాడుతూ ఉంటారు. అయితే హెన్నాను వాడేటప్పుడు చాలా మంది తెలియక అనేక తప్పులు చేస్తూ ఉంటారు. దీని వల్ల మన జుట్టుకు మేలు చేసే హెన్నా హానిని కలిగించేదిగా మారుతుంది.
జుట్టుకు హెన్నాను వాడే వారు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాల గురించి అలాగే వారు హెన్నాను వాడేటప్పుడు చేస్తున్న తప్పులు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు హెన్నాను జుట్టుకు రాసేటప్పుడు అందులో నిమ్మరసం, పెరుగు వంటివి కలుపుతూ ఉంటారు. నిమ్మరసంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పొడిబారేలా చేస్తుంది. అలాగే పెరుగును కలపడం వల్ల మనకు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. కనుక హెన్నాలో ఇవి కలపకపోవడమే మంచిది. అలాగే హెన్నాను కొందరు అప్పటికప్పుడు కలిపేసి వాడుతూ ఉంటారు. కానీ జుట్టుకు మంచి రంగు రావాలంటే హెన్నాను 8 నుండి 12 గంటల వరకు నానబెట్టిన తరువాతే వాడాలి. ముందు రోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు హెన్నాను వాడడం మంచిది. ఇక కొందరు హెన్నాను ప్లాస్టిక్ గిన్నెలో కలిపి వాడుతూ ఉంటారు. కానీ హెన్నాను వాడాలనుకునే వారు స్టెయిన్ స్టీల్ లేదా ఐరన్ గిన్నెలను వాడడం మంచిది.
ఇలా వాడడం వల్ల హెన్నా నుండి రంగు మరింత ఎక్కువగా విడుదల అవుతుంది. అలాగే దీనిని కలపడానికి ప్లాస్టిక్ స్పూన్స్ కు బదులుగా గరిటెను లేదా స్టీల్ చెంచాలను వాడడం మంచిది. అలాగే చాలా మంది హెన్నాను సాధారణ నీటిలో కలిపి జుట్టుకు రాస్తూ ఉంటారు. ఇలా సాధారణ నీటిని వాడడానికి బదులుగా టీ లేదా కాఫీ డికాషన్ ను వాడడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు మరింత నల్లగా మారుతుంది. ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హెన్నాను వాడడం వల్ల జుట్టు మరింత అందంగా తయారవుతుంది.