Ear Itching : మనం అప్పుడప్పుడూ చెవి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటాం. చెవి నుండి చీము కారడం, చెవి పోటు, చెవిలో దురద వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. చెవి సమస్యల నుండి బయటపడడానికి మనం వైద్యున్ని సంప్రదించి అనేక రకాల చెవిలో వేసుకునే చుక్కల మందులను వాడుతూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సమస్యలు ఒక్కోసారి తగ్గవు.
ఈ చెవి సమస్యలను తగ్గించే పరిష్కారాలు ఆయుర్వేదంలో కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చెవి సమస్యల నుండి బయటపడడంలో మనకు ఆవ నూనె ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన పోపుల డబ్బాలో ఉండే ఆవాల నుండి తీసే ఈ ఆవ నూనె మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఈ నూనెను విరివిరిగా ఉపయోగిస్తారు. చెవి సమస్యలతో బాధపడే వారికి ఆవ నూనె ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చెవి సమస్యలతో బాధపడుతున్న వారు 50 గ్రాముల ఆవ నూనెను తీసుకుని అందులో 20 గ్రాముల నల్ల తుమ్మ చెట్టు పువ్వులను వేయాలి. ఈ నూనెను చిన్న మంటపై నల్ల తుమ్మ చెట్టు పువ్వులు నల్లగా అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఇలా వడకట్టిన నూనెను నిల్వ చేసుకుని రోజుకు రెండు పూటలా 4 నుండి 5 చుక్కల నూనెను చెవుల్లో గోరు వెచ్చగా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెవి పోటు, చెవి నుండి చీము కారడం, చెవుల్లో దురద వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాను పాటించడం వల్ల చెవి సమస్యల నుండి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.