Flax Seeds Gel For Hair : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న సమస్యల్లో జుట్టు రాలడం అనే సమస్య కూడా ఒకటి. జుట్టు దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు విపరీతంగా జుట్టు రాలిపోయి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందనే చెప్పవచ్చు. జుట్టు కుదుళ్లకు తగినన్ని పోషకాలు అందకపోవడం, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి అనేక కారణాల చేత జుట్టు రాలిపోతూ ఉంటుంది. సహజ సిద్దంగా చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మనకు అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా కలిగి ఉండే ఆహారాల్లో ఇవి ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపపడతాయి. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో కూడా ఇవి మనకు సహాయపడతాయి. ఈ అవిసె గింజ నుండి వచ్చే జెల్ ను జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉండే లిగ్నాన్స్, డై హైడ్రో టెస్టోస్టిరాన్ అనే రసాయన సమ్మేళనాలు జుట్టు కుదుళ్లను బలంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే కెరాటిన్ ను ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. ఇవే కాకుండా ఈ అవిసె గింజల్లో విటమిన్ ఇ, సిలీనియం, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లు పొడిబారకుండా ఉండడానికి, తలలో చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండడానికి, జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరగడానికి, జుట్టు విరిగిపోకుండా ఉండడానికి దోహదపడతాయి.
ఈ అవిసె గింజలతో జెల్ ను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు చక్కగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ అవిసె గింజల జెల్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు అవిసె గింజలను తీసుకుని నానబెట్టాలి. తరువాత వీటిని నీటిలో వేసి ఉడికించాలి. అవిసె గింజలను ఉడికించడం వల్ల వాటిపై జెల్ లాగా ఏర్పడుతుంది. ఇలా జెల్ ఏర్పడగానే స్టవ్ ఆఫ్ చేసి ఈ గింజలను ఒక కాటన్ వస్త్రంలోకి తీసుకోవాలి. తరువాత చేత్తో గట్టిగా పిండుతూ జెల్ ను గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవిసె గింజల జెల్ తయారవుతుంది. ఈ జెల్ ను జుట్టుకు పట్టించి గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా అవిసె గింజల జెల్ ను వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.