Throat Pain : ప్రస్తుత వర్షాకాలంలో మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో వైరస్, బాక్టీరియాలు ఎక్కువగా విజృంభిస్తూ ఉంటాయి. వీటి కారణంగా మనం చాలా త్వరగా అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు త్వరగా రోగాల బారిన పడుతూ ఉంటారు. ఈ వైరస్, బాక్టీరియాల వల్ల మనం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. వైద్యులు వీటి నుండి ఉపశమనం పొందడానికి మనకు యాంటీ బయాటిక్స్ ను ఎక్కువగా సూచిస్తూ ఉంటారు.
కానీ ప్రతిసారీ యాంటీ బయాటిక్ మందులను వాడడం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి సహజ సిద్దంగా మనం ఇన్ ఫెక్షన్ ల బారి నుండి బయటపడవచ్చు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీళ్లను, పండ్ల రసాలను, హెర్బల్ టీ లను ఎక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గొంతులో పేరుకు పోయిన కఫం బయటకు పోయి దగ్గు సమస్య రాకుండా ఉంటుంది. అలాగే వెల్లుల్లి పాయలను రోజూ ఉదయాన్నే నేరుగా లేదా ఉడికించి తినడం వల్ల ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.
గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్ వంటి వాటితో బాధపడే వారు నీటిలో ఉప్పు వేసి ఆ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, ఇన్ ఫెక్షన్ ల నుంచి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా సాయంత్రం పడుకునే ముందు పాలను తాగడం, కఫాన్ని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేయకూడదు. గొంతునొప్పితో బాధపడే వారు గట్టిగా మాట్లాడడం, అరవడం వంటివి చేయడం వల్ల గొంతునొప్పి పెరిగే అవకాశం ఉంటుంది. కనుక గొంతునొప్పితో బాధపడే వారు వీలైనంత తక్కుంగా మాట్లాడడం వల్ల గొంతుకు తగిన విశ్రాంతి లభించి గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.
జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి వాటితో బాధపడుతున్నప్పుడు మద్యపానం, ధూమపానం చేయడం అలాగే టీ, కాఫీలను తాగడం వంటివి మానేయాలి. అదే విధంగా దగ్గు, గొంతునొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్ వంటి వాటితో బాధపడే వారు గోరు వెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. అలాగే నీటిలో తులసి ఆకులను వేసి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి అందులో నిమ్మ రసాన్ని వేసి కలిపి తాగడం వల్ల గొంతులో ఇన్ ఫెక్షన్, గొంతు నొప్పి తగ్గి గొంతు సాఫీగా అవుతుంది.
అంతేకాకుండా నీటిలో తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటితో రోజుకు రెండు పూటలా ఆవిరి పట్టడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారీ యాంటీ బయాటిక్స్ మీద ఆధారపడకుండా ఈ ఇంటి చిట్కాలను ఉపయోగించి కూడా సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాలను పాటించిన తరువాత కూడా సమస్య తగ్గు ముఖం పట్టకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. దీంతో సమస్య నుంచి బయట పడవచ్చు.