దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే కోవిడ్ మూడో వేవ్‌లో చిన్నారులకు ఎక్కువగా ముప్పు కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. దీంతో వారిని కోవిడ్ పట్ల జాగ్రత్తగా ఉంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకు గాను వారిలో రోగ నిరోధక శక్తిని పెంచాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి.
1. ఆరోగ్యానికి పసుపు, తేనె అద్భుతంగా పనిచేస్తాయి. పసుపు వాపులను తగ్గించి వైరస్‌పై పోరాటం చేస్తుంది. పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ తేనెలను కలిపి చిన్నారులకు రోజూ ఇవ్వాలి. రాత్రి నిద్రించే ముందు ఈ మిశ్రమాన్ని ఇవ్వాలి. దీంతో వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను ఎదుర్కొనేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది.
2. అల్లం రసం లేదా అల్లం కషాయం తాగడం వల్ల పెద్దల్లో ఫ్లూ, దగ్గు, జ్వరం తగ్గుతాయి. అల్లం శరీరానికి సహజసిద్ధమైన శక్తిని అందించే మూలకంగా పనిచేస్తుంది. అర టీస్పూన్ తులసి ఆకుల రసం, తేనె 5 చుక్కలు, కొద్దిగా అల్లం రసం కలిపి పిల్లలకు ఇవ్వాలి. దీన్ని ఉదయాన్నే పరగడుపునే ఇవ్వాలి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
3. బెల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలకు రోజూ ఆహారంలో బెల్లం ఇవ్వాలి. దీంతో వారిలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాక, తక్షణమే శక్తి లభిస్తుంది. వారు ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
4. వేపాకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపడమే కాక, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఉదయాన్నే పరగడుపునే చిన్నారులకు 2 వేపాకులను తినిపించాలి. వారంలో 3 సార్లు వేపాకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
5. చిన్నారులకు రాత్రి నిద్రించే ముందు పాలను తాగించాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, లవంగాల పొడి, మిరియాల పొడి లేదా పసుపులలో దేన్నయినా సరే వేసి పాలను తాగించాలి. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచవచ్చు.
6. నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పిల్లలకు రోజూ నెయ్యిని ఆహారంలో ఇవ్వాలి. ఇది వారికి బలాన్నిస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
7. పిల్లలకు రోజూ 1 టీస్పూన్ చ్యవన్‌ప్రాశ్ లేహ్యాన్ని ఇవ్వాలి. వారు దాన్ని తినలేకపోతే పాలతో పాటు ఇవ్వవచ్చు. చ్యవన్‌ప్రాశ్‌లో అనేక మూలికలు ఉంటాయి. అవి చిన్నారులు, పెద్దల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
8. పిల్లలకు రోజూ రాత్రి నిద్రించే ముందు పాలలో పావు టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగించాలి. రోగ నిరోధక శక్తి పెరగడమే కాక, జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365