ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వాతావరణంలో మార్పులు, అస్తవ్యస్తమైన జీవనశైలి, టీ, కాఫీలు అతిగా తీసుకోవడం, కీళ్ల నొప్పులు, డయాబెటిస్.. వంటి ఎన్నో కారణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్య వస్తుంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే కింద తెలిపిన పలు సులభమైన చిట్కాలను పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
1. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పూట గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనెను కలుపుకుని తాగాలి. దీని వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
2. నిద్రలేమి సమస్య ఉన్నవారు పాలు, పెరుగు, చెరుకు రసం, అరటి పండ్లు, యాపిల్, నారింజ, దానిమ్మ వంటి ఆహారాలను తీసుకోవాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది.
3. వారానికి ఒకసారి శరీరం మొత్తానికి నూనె పట్టించి మర్దనా చేసి స్నానం చేయాలి. అలాగే నూనెతో తలకు మర్దనా చేస్తుండాలి. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది.
4. రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుంది.
5. రాత్రి నిద్రకు ముందు అరిపాదాలను లావెండర్ నూనె లేదా తేనెతో మర్దనా చేయాలి. గాఢ నిద్ర పడుతుంది.
6. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తాగాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
7. రాత్రి భోజనం చేసిన తరువాత పాలలో చిటికెడు జాజికాయ చూర్ణం లేదా బాదం పప్పు, దాల్చిన చెక్క, యాలకుల పొడి వేసి తాగాలి.
8. గసగసాలను వస్త్రంలో చుట్టి వాసన పీల్చాలి. నిద్ర బాగా పడుతుంది.
9. జాజిపూలను దిండు కింద పెట్టి పడుకోవాలి. నిద్ర పడుతుంది.
10. బాదం నూనెతో తలకు తరచూ మర్దనా చేయాలి. దీని వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి సమస్యను తగ్గించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365